తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్ 2025: పన్ను రిబేట్​ రూ.10లక్షలు- TDS రూ.1లక్షకు పెంచే ఛాన్స్​! - BUDGET 2025 EXPECTATIONS

కేంద్ర బడ్జెట్ 2025: గృహ రుణాలు తీసుకున్నవారికి రెండు శుభవార్తలు అందే ఛాన్స్- చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌‌కు ఊరట - 'ప్రిజంప్టివ్ ట్యాక్స్' టర్నోవర్ పరిమితి పెంచే యోచన!

Budget 2025 Expectations
Budget 2025 Expectations (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2025, 6:28 PM IST

Budget 2025 Expectations : కేంద్ర బడ్జెట్-2025 కోసం సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఏయే రంగాలకు, ఏయే వర్గాలకు ఏమేం ఇచ్చేది ప్రకటిస్తారు. తమ అవసరాలను తీర్చే, ప్రయోజనాన్ని చేకూర్చే ప్రకటన ఏదైనా వెలువడుతుందనే కొండంత ఆశతో సామాన్యులు, చిరు వ్యాపారులు బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంటారు. కేంద్ర బడ్జెట్‌పై వారు పెట్టుకున్న పలు అంచనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నూతన ఆదాయపు పన్ను బిల్లు
'నూతన ఆదాయపు పన్ను బిల్లు' - ఈసారి కేంద్ర బడ్జెట్‌లో చాలా ముఖ్యమైంది ఇదే. 1961లో అమల్లోకి తెచ్చిన ఆదాయపు పన్ను చట్టం స్థానంలో దీన్ని అమల్లోకి తేనున్నారు. ఈ బిల్లుపై తొలుత అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరుపుతారు. తదుపరిగా 2025 సంవత్సరం చివర్లోగా దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యేంత సులువుగా ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళతరంగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. బడ్జెట్ ప్రసంగంలో ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో"
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం మరింత పెంచుతుందనే ఆశాభావంతో వేతన జీవులు/ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. అల్ప ఆదాయ వర్గాల వారికి పన్ను మినహాయింపు పరిమితి సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా పన్ను చట్టాలను సరళీకరిస్తారని అంచనా వేస్తున్నారు. పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా టాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3 శ్లాబులకు కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ఠ పన్ను రేటు 30 శాతంగా ఉండగా, దీనిని 25 శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సెక్షన్ 87A కింద రూ.7 లక్షల ఆదాయం వరకు టాక్స్ రిబేట్ వర్తిస్తుండగా, దీనిని రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్ కోసం
ప్రిజంప్టివ్ ట్యాక్స్ అనేది చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, చిన్న తరహా ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన అంశం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్జించే అవకాశమున్న అంచనా ఆదాయాల ఆధారంగా వారిపై పన్నును విధిస్తారు. ఈక్రమంలో వారికి వచ్చే వాస్తవిక లాభాలను పరిగణనలోకి తీసుకోరు. దీనివల్ల చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరుతుంటుంది. ఏటా రూ.2 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌ మాత్రమే ఈ కేటగిరిలోకి వస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని 44ఏడీ, 44ఏడీఏ సెక్షన్లకు సవరణలు చేసి ప్రిజంప్టివ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌ వార్షిక టర్నోవర్ పరిమితిని పెంచే అవకాశం ఉంది.

గృహ రుణాల వడ్డీపై మినహాయింపు
ఆదాయపు చట్టంలోని సెక్షన్ 24(బీ) కింద గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల గృహ రుణాలు తీసుకున్న వేతన జీవులకు లబ్ధి కలుగుతుంది. వీరికి ఉపశమనం కలిగించేలా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచే అవకాశం ఉంది.

టీడీఎస్, టీసీఎస్ నిబంధనల సరళీకరణ
మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), మూలం వద్ద పన్ను సేకరణ (టీసీఎస్) అనేవి భారత పన్ను విధానంలోని ప్రాథమిక భావనలు. టీడీఎస్, టీసీఎస్ నిబంధనలను సరళతరం చేసే అంశంపై ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయా నిబంధనల మధ్య సారూప్యత లేకుండా చేయడం, స్పష్టత ఉండేలా మార్చడం, సామాన్యులకూ అర్థమయ్యేలా అందుబాటులోకి తేవడం అనేవి ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. టీడీఎస్ నిబంధనల్లో పదేపదే సవరణలు చేస్తుండటంతో గతంలో పలు న్యాయవివాదాలు తలెత్తాయి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులను అయోమయం ఆవరించింది.

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. దీనిని ఇప్పుడు ఒక లక్ష రూపాయలకు పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు.

6 కోట్ల మందికి రూ.25వేల కోట్లు ఆదా
ఒకవేళ ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలోని దాదాపు 6 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు ఏటా రూ.25వేల కోట్ల దాకా ఆదా అవుతాయి. చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఎంఎస్‌ఎంఈ రంగానికి దాదాపు రూ.5వేల కోట్ల దాకా అదనపు ఆదా లభిస్తుంది.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ - ఖరారైన పార్లమెంట్ సమావేశాల తేదీలు!

ఇకపై పన్ను చెల్లింపులు మరింత ఈజీ! బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఇన్​కమ్​ ట్యాక్స్ బిల్లు!

ABOUT THE AUTHOR

...view details