తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​లో రైతుల కోసం రూ.1.52 లక్షల కోట్లు - నేచురల్​ ఫార్మింగ్​పై ప్రత్యేక దృష్టి! - Agriculture Budget 2024

Agriculture Budget 2024 : వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయరంగంలో ఉత్పత్తి, నిల్వలు, మార్కెటింగ్‌ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన ఆర్థిక మంత్రి ఇందుకోసం ఈ ఏడాది పద్దులో రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతుల కోసం, వారి భూములు కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Agriculture Budget 2024
Budget 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 4:20 PM IST

Agriculture Budget 2024 : వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించిన సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యయసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, నిల్వలు, మార్కెటింగ్‌ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీతారామన్‌ చెప్పారు. సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామన్నారు.

వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి ప్రాముఖ్యాన్ని ఆర్థికమంత్రి నొక్కి చెప్పారు. ప్రధానంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టి సారించామన్న సీతారామన్‌ వాటికి పరిశోధన, అభివృద్ధికి గణనీయమైన నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా అధిక దిగుబడి నిచ్చే 109 పంటలు, శీతోష్ణస్థితిని తట్టుకునే 32 రకాల సాగు, ఉద్యావన పంటలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు గణనీయంగా పెంచినట్లు చెప్పారు. కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించినట్లు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం
దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్‌ఫుట్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో ఆత్మనిర్భరత సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించినట్లు వివరించారు.

రొయ్యల పెంపకం కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఆధారంగా 5 రాష్రాల్లో 'జన్-సమర్థ్‌ బీమా'ను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్రాల భాగస్వామ్యంతో డిజిటల్ పబ్లిక్​ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూరగాయల సప్లయ్‌ చైన్‌ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్ల మంది రైతుల డేటాను సేకరించనున్నట్లు చెప్పారు. వినియోగం అధికంగానే ఉండే ప్రాంతాలకు దగ్గరలో కూరగాయల ఉత్పత్తికి మోగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటామని సీతారామన్‌ వివరించారు.

"ఈ ఏడాది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించాం. ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి కోసం పెద్దస్థాయిలో క్లస్టర్‌లను అభివృద్ధి చేస్తాం. సేకరణలు, నిల్వ, మార్కెటింగ్, సహా కూరగాయల సరఫరా గొలుసుల కోసం రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, స్టార్టప్‌లను మేము ప్రోత్సహిస్తాం. వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులు, వారి భూములు కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఈ ఏడాదిలో నాలుగు వందల జిల్లాల్లో డీపీఐని ఉపయోగించి ఖరీఫ్ కోసం డిజిటల్ సర్వే చేపట్టనున్నాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూ రిజిస్ట్రీల్లోకి తీసుకురానున్నాం. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఆధారంగా 5 రాష్ట్రాల్లో జన్-సమర్థ్‌ బీమాను కల్పించనున్నాం."
- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ప్రత్యేక సాయం
నిత్యం వరదలతో అతలాకుతలమవుతున్న బిహార్‌కు ఈ బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించింది. కోసి-మేచి ఇంటర్‌ లింక్‌ ప్రాజెక్టు సహా మరో 20 ప్రాజెక్టులకు రూ.11,500 కోట్లను అందించనున్నట్లు తెలిపింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు కారణంగా వరదలు ప్రభావానికి గురవుతున్న అసోంకు సహాయం అందించనున్నామని స్పష్టం చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం రాష్ట్రాలకు సహాయ, సహాకారాలు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

భారీగా ఉద్యోగాలు- ఐటీ శ్లాబుల్లో మార్పులు- బడ్జెట్​లో చెప్పిన గుడ్​న్యూస్​ లిస్ట్ ఇదే! - Budget 2024 Key Highlights

కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024

ABOUT THE AUTHOR

...view details