Indian Wedding Costs :భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సంప్రదాయబద్ధంగా బంధు, మిత్రులను పిలుచుకుని ఉన్నంతలో చక్కగా పెళ్లి చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ఒక ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్లో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఓ నివేదిక అంచనా వేసింది. భారత్లో ఆహారం, కిరాణా వస్తువుల కొనుగోలు తర్వాత వివాహ ఖర్చులే రెండో స్థానంలో ఉన్నాయి. సగటు భారతీయుడు విద్య కంటే వివాహ వేడుకలకే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడట. అలాగే భారత్లో ఒక ఏడాదికి 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయట.
చైనా కంటే భారత్లోనే పెళ్లిళ్లు ఎక్కువ
ఏడాదికి చైనాలో 70-80 లక్షల వివాహాలు, అమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమెరికాలో మ్యారేజ్ బిజినెస్ (70 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారత్లో పెళ్లిళ్ల సీజన్లో జరిగే వ్యాపారం (130 బిలియన్ డాలర్లు) దాదాపు రెట్టింపు ఉంటుంది. చైనా పెళ్లిళ్ల బిజినెస్ మాత్రం 170 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా వ్యాపారం (681 బిలియన్ల డాలర్లు) తర్వాత రెండో అతిపెద్ద రిటైల్ కేటగిరీగా వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా జరిగే వ్యాపారం నిలిచింది.
అందుకే ఖర్చుకు వెనకాడరు!
భారతదేశంలో వివాహాలు సంప్రదాయబద్దంగా జరుగుతాయి. వివాహ వేడుకను భారీగా ఖర్చు పెట్టి జరుపుకుంటారు. ఆభరణాలు, దుస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే వివాహాల వల్ల ఎలక్ట్రానిక్, ఆహార ఉత్పత్తుల వ్యాపారం కూడా పెరుగుతుంది. వివాహాలకు అయ్యే ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పుటికీ అది సాధ్యం కావడం లేదు. ఇతర దేశాలకు వెళ్లి కొందరు భారతీయులు అత్యంత ఆడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు.
రూ.10 లక్షల కోట్ల బిజినెస్!
"ఏటా భారతదేశంలో 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతాయి. వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్లు) వ్యాపారం జరుగుతుంది. భారతీయ వివాహాలు కొన్ని రోజుల పాటు జరుగుతుంటాయి. అలాగే సంగీత్, ప్రీ వెడ్డింగ్ వంటి కార్యక్రమాలను చేసుకుంటారు. తమ ఆర్థిక స్థితిని బట్టి సాధారణ స్థాయి నుంచి అత్యంత ఆడంబరంగా, వైభవంగా వివాహాలు చేసుకుంటారు" అని బ్రోకరేజ్ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.