Banks To Operate 5 Days A Week Soon :బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా వారంలో ఐదు పనిదినాలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఈ కోరిక నెరవేరే అవకాశం ఉంది. వారంలో రెండు వీక్లీ ఆఫ్లకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఉద్యోగుల సంఘాల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. బహుశా 2024 చివరి నాటికి ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఓ అంచనా. ఇదే జరిగితే డిసెంబర్ నుంచి బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది.
పెరగనున్న పని గంటలు!
బ్యాంకులు వారంలో 5 రోజులే పనిచేసినా, ఖాతాదారులకు అందించే సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని ఫోరమ్ హామీ ఇచ్చింది. అంటే పని గంటలు పెంచుతామని స్పష్టం చేసింది. 2023 డిసెంబర్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సహా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ యూనియన్ల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది. దీని ప్రకారం, బ్యాంకులు వారంలో 5 రోజులు మాత్రమే పనిచేయాలి. అయితే దీన్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.
2024 మార్చి 8న ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్‌తో పాటు, ఐబీఏ, బ్యాంకు యూనియన్లు 9వ జాయింట్ నోట్‌పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉంటాయి.
డిసెంబర్ నుంచే!
ఐబీఏ, బ్యాంకు యూనియన్లు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రమే ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బ్యాంక్ పని వేళలు, అంతర్గత కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో ఈ ప్రతిపాదన గురించి చర్చించే అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పటికిలోగా జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. అయితే కొంత మంది బ్యాంకు ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభత్వం ఆమోదం తెలిపితే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25 ప్రకారం, ఇకపై అన్ని శనివారాలు అధికారికంగా సెలవు దినాలుగా పరిగణించబడతాయి.