Bal Jeevan Bima Yojana Scheme Benefits :నేటి ఆధునిక యుగంలో ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. ఎంత పొదుపు చేస్తున్నామన్నదే చాలా కీలకం. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి పేరు మీద పొదుపు ప్రారంభించడం చాలా ఉత్తమమైన నిర్ణయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతుంటాయి. ప్రధానంగా వారి చదువుల కోసం లక్షలు పోయాల్సి వస్తే.. పుస్తకాలు, యూనిఫార్మ్ వంటి ఇతర వాటికోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావొచ్చంటున్నారు నిపుణులు.
కాబట్టి, పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే వారి పేరు మీద ఏదైనా స్కీమ్‌లో పొదుపు స్టార్ట్ చేయండని సలహా ఇస్తున్నారు. అందుకోసం వందలు, వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. 'ఇండియన్ పోస్టాఫీస్'(Post Office) అందిస్తున్న ఈ పథకంలో కేవలం రోజుకు 6 రూపాయలు పొదుపు చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారంటున్నారు. అదే.. 18 రూపాయలు పొదుపు చేస్తే 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇంతకీ, ఏంటి ఆ పథకం? అర్హతలేంటి? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ పోస్టాఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన ఆ స్కీమ్ పేరు.. బాల్ జీవన్ బీమా పథకం(Bal Jeevan Bima Scheme). ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు.. వారి ఆర్థిక స్తోమతను బట్టి కనిష్ఠంగా రోజుకు రూ. 6, గరిష్ఠంగా రూ. 18 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద ఈ పొదుపును స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బాల్ జీవన్ బీమా పథకంలో 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లల వరకు పేరెంట్స్ పొదుపు చేయవచ్చు. అయితే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు.
రూ. 18తో రూ. 6 లక్షల రాబడి! :ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే బాలా జీవన్ బీమా పథకం కింద ప్రయోజం అందుతుంది. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారు కనీసం రోజుకు 6 రూపాయలు పొదుపు చేస్తే.. మెచ్యూరిటీ ముగిశాక కనీస హామీ మొత్తం లక్ష రూపాయల వరకు రాబడి అందుతుంది. అదే గరిష్ఠంగా.. రోజుకు 18 రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ ముగిశాక రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఇకపోతే.. మీరు ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ. 36(ఒక్కొక్కరికి రూ.18) పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.