Radhika Gupta SIP Investment :సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడి పాఠాలు, సూచనలు, సలహాలు అందిస్తుంటారు ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా. తాజాగా ఆమె మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి గమనించిన కథనంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్ ఒక స్కామ్, రిటైల్ పెట్టుబడిదారులు తెలివితక్కువవారని వచ్చిన కథనంపై స్పందించారు.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పెట్టుబడి అవసరాలను మాత్రమే కాకుండా, భారతీయ పెట్టుబడిదారుల సాధారణ పొదుపు అవసరాలను కూడా తీర్చే ఒక సాధనాన్ని సృష్టించిందని కొనియాడారు. ప్రస్తుతం కోట్లాది మంది SIPల్లో పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. సీఐపీల్లో పెట్టుబడి పెట్టేవారు మంచి డబ్బు సంపాదించుకోవచ్చని రాధిక తెలిపారు. స్టాక్ మార్కెట్లు సగటు రాబడిని అందించినప్పటికీ ఈక్విటీ ఫండ్‌లో సీఐపీ పదేళ్ల రాబడిని తనిఖీ చేయండని సూచించారు.
సీఐపీలు ఫండ్ మేనేజర్లు క్రమంగా మూలధనాన్ని విస్తరించడానికి అనుమతిస్తాయని తెలిపారు. SIPలు ఎంత త్వరగా రిటైల్ ఈక్విటీ సంస్కృతిని సృష్టించడంలో భాగమయ్యాయో చూసి ప్రపంచ దేశాలు ఆకర్షితిలయ్యాయని తెలిపారు. ఇది చాలా దేశాల్లో లేదని అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఒక స్కామ్, రిటైల్ పెట్టుబడిదారులు తెలివితక్కువవారు అంటూ వచ్చిన కథనాల వల్ల ఎలాంటి లాభం లేదని రాధిక అభిప్రాయపడ్డారు.
'స్టార్టప్ రొమాన్స్- ఆ వలలో పడకండి'
ఇటీవల స్టార్టప్స్ కోసం మాట్లాడారు రాధిక. "స్టార్టప్ రొమాన్స్ సంస్కృతి పెరుగుతోంది. స్టార్టప్ లైఫ్ అంటే సరదా వాతావరణంలో పని, రోజంతా ఐడియాలపై చర్చలు, నిధుల సమీకరణ, సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇవ్వడం, వారాంతాలు సరదాగా గడపడం అనే అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. ఆ ఉచ్చులో పడకండి" అని సూచించారు.
"త్వరలోనే స్టార్టప్ వాస్తవం బోధపడుతుంది. అంతంతమాత్రంగానే నిధుల లభ్యత, పరిమిత పని పరిస్థితులు, తిరస్కరణలు, నియామకాల్లో సవాళ్లు, అనిశ్చిత పరిస్థితులు, ఒత్తిడి కూడా అందులో భాగమేనని అర్థమవుతుంది" అని రాధిక రాసుకొచ్చారు. ఆమె చేసిన ముందుజాగ్రత్త పోస్ట్‌పై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టార్టప్ అనేది అంత సులభమైన విషయం ఏమీ కాదని, ప్రజలు విజయవంతమైన వ్యక్తుల జీవితాలను మాత్రమే చూస్తారని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.