Anil Ambani Banned From Security Market :ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ స్టాక్‌మార్కెట్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ (SEBI) 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. 'రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్' (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు సహా, మరో 24 సంస్థలపైనా నిషేధం విధిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
రూ.25 కోట్ల జరిమానా
అనిల్ అంబానీపై సెబీ రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండకూడదని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆర్నెళ్ల పాటు నిషేధించింది. పైగా రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది.
అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. ఇందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్‌ఎఫ్‌హెచ్‌ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ, వాటిని యాజమాన్యం ఏమాత్రం ఖాతరు చేయలేదని తెలిపింది. అనిల్ అంబానీ ఆదేశాలతోనే, కీలక అధికారులు కావాలని నిబంధనలను అతిక్రమించారని సెబీ ఆరోపించింది.
దివాలా తీయడానికి కారణమదే!
2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పలు కంపెనీలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ కంపెనీలు అన్నీ ఆర్థికంగా అత్యంత బలహీనమైనవి లేదా నష్టాల్లో ఉన్నవి కావడం గమనార్హం. ఇలాంటి సంస్థలకు ఎలాంటి తాకట్టు లేదా సెక్యూరిటీ లేకుండా, ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం ద్వారా అనిల్ అంబానీ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సెబీ గుర్తించింది. అంతేకాదు RHFL నుంచి జీపీసీ రుణాలు పొందిన వారు, నిధులు పొందుతున్న సంస్థలు అన్నీ ప్రమోటర్ గ్రూప్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు సెబీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఫలితంగా ఆర్‌ఎఫ్‌హెచ్‌ఎల్ దివాలా తీసి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సివచ్చింది. తద్వారా పబ్లిక్ షేర్‌హోల్డర్లు భారీగా నష్టపోయారని సెబీ పేర్కొంది.
ఉదాహరణకు 2018లో కంపెనీ షేరు ధర రూ.59.60 వద్ద ఉండగా, 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావడం, నిధులు అడుగంటిపోవటంతో షేరు విలువ రూ.0.75కు పడిపోయినట్లు సెబీ గుర్తుచేసింది. ఇప్పటికీ 9 లక్షల మంది షేర్‌హోల్డర్లు నష్టాలతో కొనసాగుతున్నారని వివరించింది.
భారీ ఫైన్
సెబీ అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ సీఎఫ్ఓ అమిత్ బాప్నాపై రూ.27 కోట్లు, ప్రస్తుతం ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ సీఈఓ రవీంద్ర సుదాల్కర్పై రూ.26 కోట్లు, ప్రస్తుత సీఎఫ్ఓ పింకేశ్ షాపై రూ.21 కోట్ల మేర జరిమానా విధించింది. అంతేకాదు ఈ మోసపూరిత పథకంతో సంబంధమున్న సంస్థలపైనా రూ.25 కోట్లు చొప్పున ఫైన్ వేసింది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించడం గమనార్హం.