Anant Radhika Wedding Pics :ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఆనందకర క్షణాలు అందరినీ ఆకర్షించాయి. వరమాలను మార్చుకునే సమయంలో వధూవరులు ఆటపట్టించుకునే విధానం కార్యక్రమానికి విచ్చేసిన అతిరథమహారథులను ఆకట్టుకుంది. అందరూ చప్పట్లతో వివాహ మండపాన్ని హోరెత్తించారు. అనంత్, రాధిక కుటుంబసభ్యులు, స్నేహితులు వేదికపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆమెతో కలలుగన్న సౌధాన్ని!
అయితే ఏడు నెలల కిందటే మొదలైన అనంత్, రాధిక వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో శుభ్ వివాహ్‌లో భాగంగా మంగళసూత్ర ధారణతో ఇద్దరూ ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అనంత్- రాధిక ప్రేమ బాసలు కూడా చేసుకున్నారు. ఆమెతో కలలుగన్న సౌధాన్ని నిర్మించుకుంటానని కొత్త పెళ్లికుమారుడు ప్రామిస్ చేశారు.
అనంత్ అలా- రాధిక ఇలా!
"శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో ఇద్దరం కలిసి మనం కలలుకన్నట్టుగా మన ఇంటిని నిర్మించుకుందామని నీకు ప్రామిస్ చేస్తున్నాను. మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు. మనం ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా అది ప్రేమతో నిండి ఉంటుంది" అని తన భార్యకు భరోసా ఇచ్చారు. "మన ప్రేమ, బంధం కలగలిసిన ప్రాంతంగా మన ఇల్లు ఉంటుంది" అని అనంత్ అంబానీకి రాధిక కూడా హామీ ఇచ్చారు.
దిగి వచ్చిన తారాలోకం
అయితే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబయి నగరం మిరుమిట్లు గొలిపింది. సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు. వారంతా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. సినీతారలు షారుక్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ కాలు కదిపారు. వారికి రజనీకాంత్ కూడా జత కలిశారు. మాధురీదీక్షిత్ చోళీ కే పీచే పాటకు డ్యాన్స్ చేశారు. దాదాపు బాలీవుడ్ మొత్తం ప్రస్తుతం జియో వరల్డ్ సెంటర్ వద్దే ఉంది.
ప్రధాని మోదీ కూడా!
దక్షిణాది నుంచి రజనీకాంత్, వెంకటేష్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అఖిల్, నయనతార తదితర ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్, ధోనీ, హర్దిక్ పాండ్యతో పాటు పలువురు తరలివచ్చారు. దేశంలోని రాజకీయ నాయకులు సైతం పాల్గొని నూతన వధువరులను అశీర్వాదించారు. అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్ సోదరీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే శనివారం జరగనున్న శుభ్ ఆశీర్వాద్‌కు అతిథులంతా ఫార్మల్ దుస్తుల్లో రానున్నారు. ఆదివారం నాటి మంగళ్ ఉత్సవ్‌తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జరిగే వేడుకకు హాజరయ్యే అవకాశముంది.