తెలంగాణ

telangana

ETV Bharat / business

హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం - ఇకపై IPL లైవ్‌ మ్యాచ్‌లన్నీ అక్కడే! - DISNEY RELIANCE MERGER

డిస్నీ+ హాట్‌స్టార్‌, జియో సినిమా మెర్జెర్‌ - అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరణ!

Disney-Reliance merger
Disney-Reliance merger (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 2:27 PM IST

Updated : Oct 19, 2024, 2:33 PM IST

Disney Reliance Merger :రిలయన్స్‌, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ రెండు దిగ్గజ సంస్థల విలీనం జరిగిన తరువాత, కేవలం ఒక్క ఓటీటీ మాత్రమే ఉంచేందుకు రిలయన్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. అప్పుడు ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్‌'గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అప్పుడు క్రికెట్ మ్యాచ్‌ లైవ్ ప్రసారాలు అన్నీ హాట్‌స్టార్‌లోనే వీక్షించాల్సి ఉంటుందన్నమాట.

వయకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనం వేళ - డిస్నీ, రిలయన్స్‌ సంస్థలు నిర్వహిస్తున్న రెండు ఓటీటీలను ఏం చేస్తారనేది చాలా రోజుల నుంచి ఆసక్తికరంగా మారింది. తొలుత హాట్‌స్టార్‌నే జియో సినిమాలో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌లకు రెండు వేర్వేరు ఓటీటీలను కొనసాగించాలన్న ఆలోచన కూడా రిలయన్స్‌ చేసినట్లు తెలిసింది. ఆఖరికి జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హాట్‌స్టార్‌కు ఉన్న మెరుగైన టెక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అందుకు కారణమని సమాచారం. జియో సినిమాకు గూగుల్‌ప్లే స్టోర్‌లో 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉండగా, డిస్నీ+హాట్‌స్టార్‌కు ఏకంగా 500 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. అంటే జియో సినిమా కంటే 5 రెట్లు ఎక్కువ డౌన్‌లోడ్స్ హాట్‌స్టార్‌కు ఉన్నాయి. ఈ రెండింటి విలీనానంతరం ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది.

Reliance Disney Merger :దేశంలో స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వివిధ టీవీ ఛానెళ్లతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ (డిస్నీ+హాట్‌స్టార్‌)ను నిర్వహిస్తోంది. ఇక రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ టెలివిజన్‌ ఛానెళ్ల వ్యాపారాలతో పాటుగా, ఓటీటీని (జియో సినిమా) కూడా నడుపుతోంది. దీంతోపాటు ప్రొడక్షన్‌, మోషన్‌ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉంది. జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్‌, వాల్ట్‌ డిస్నీ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌ (ఎన్​సీఎల్​టీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ పూర్తయితే వివిధ భాషల్లో వందకు పైగా ఛానెళ్లు, 2 ఓటీటీలు విలీన సంస్థ చేతిలో ఉండనున్నాయి. విలీనం అనంతరం ఈ జాయింట్​ వెంచర్​కు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సంయుక్త సంస్థలో 63.13 శాతం వాటా రిలయన్స్‌కు, 36.84 శాతం వాటా డిస్నీకి వెళ్లనున్నాయి. విలీనం అనంతరం ఓటీటీ వ్యాపారాభివృద్ధికి రూ.11,500 కోట్లు రిలయన్స్‌ పెట్టుబడిగా పెట్టనున్నట్లు రిలయన్స్‌ ఇప్పటికే ప్రకటించింది.

Last Updated : Oct 19, 2024, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details