తెలంగాణ

telangana

ETV Bharat / business

సింపుల్​గా అదానీ చిన్న కొడుకు పెళ్లి- సెలబ్రిటీలకు నో ఇన్విటేషన్- అవన్నీ రూమర్సే! - GAUTAM ADANI SON WEDDING

గౌతమ్‌ అదానీ రెండో కుమారుడు పెళ్లి అంతా సింపుల్​గానే!

Gautam Adani Son Wedding
Gautam Adani Son Wedding (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 7:09 AM IST

Updated : Jan 22, 2025, 8:34 AM IST

Gautam Adani Son Wedding : అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ ఇంటి వివాహ వేడుక అంటే అందరూ చాలా ఘనంగా జరుగుతుందని కచ్చితంగా ఊహించుకుంటారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం మరో కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నాలుగు నెలలపాటు అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అతిథులు తరలివచ్చారు. కొన్ని కోట్ల రూపాయిల ఖర్చుతో అనంత్, రాధిక వివాహం గ్రాండ్ గా జరిగింది.

ఇప్పుడు అదానీ చిన్న కుమారుడు జీత్‌ అదానీ పెళ్లి అలానే జరుగుతుందని అంతా అంచనా వేశారు. ఎలాన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులను జీత్ వివాహ వేడుకకు అదానీ ఆహ్వానిస్తున్నారని, టేలర్‌ స్విఫ్ట్‌ ప్రదర్శన ఉండబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అహ్మదాబాద్​ క్రికెట్​ స్టేడియంలో జరిగే ఇండియా- ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్‌ను జీత్ పెళ్లి కోసమే వేరే చోటుకు తరలించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ఆ విషయంపై ఇప్పుడు గౌతమ్ అదానీ స్పందించారు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళాకు కుటుంబంతో పాటు హాజరైన అదానీ, తన కొడుకు జీత్ వివాహం నిరాడంబరంగా ఫిబ్రవరి 7న జరుగుతుందని వెల్లడించారు. సంప్రదాయంగా పద్ధతిలో, సాధారణ ప్రజల మాదిరిగానే వేడుకను జరుపుకుంటామని చెప్పారు. సెలబ్రిటీల మహా కుంభ్​గా జీత్​ వివాహం జరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, కచ్చితంగా కాదు అని బదులిచ్చారు.

దాని ప్రకారం, జీత్ అదానీ పెళ్లికి సెలెబ్రిటీలను ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా వస్తున్నవి ఊహాగానాలు మాత్రమేనని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కుమార్తె దివా షాతో జీత్‌ అదానీ నిశ్చితార్థం అహ్మదాబాద్‌లో గతేడాది మార్చి 23వ తేదీన సింపుల్​గా జరిగింది. ఇప్పుడు పెళ్లి కూడా అహ్మదాబాద్‌లోనే అదే విధంగా జరగనున్నట్లు అదానీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

స్వయంగా భక్తులకు వడ్డన
కాగా, త్రివేణి సంగమంలో భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, పెద్ద కోడలు పరిధి, మనవరాలు కావేరితో కలిసి గౌతమ్ అదానీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇస్కాన్‌ శిబిరాన్ని సందర్శించారు. భోజన తయారీలో పాలుపంచుకున్నారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. ఇస్కాన్‌, అదానీ గ్రూప్‌తో కలిసి నిత్యం ఇక్కడ లక్షమంది భక్తులకు భోజనాలు సమకూరుస్తోంది. గీతా ప్రెస్‌తో కలిసి కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఆర్తి సంగ్రహ పుస్తకాలను ఉచితంగా (కోటి కాపీలు) అందిస్తున్నారు.

Last Updated : Jan 22, 2025, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details