Packaged Food Buying Tips :ప్యాకేజ్డ్ ఫుడ్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. జ్యూస్‌ల నుంచి బియ్యం వరకు అన్నీ ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలనే వాడుతున్నాం. అయితే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కంపెనీలు సరైన ప్రమాణాల పాటించకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ వాడినవారు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది. దుకాణం లేదా సూపర్ మార్కెట్‌లో ఏవైనా ప్యాకేజ్డ్ పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా లేబుల్‌లను తనిఖీ చేయాలి. ఇంతకీ ఈ లేబుల్‌లో మనం తనిఖీ చేయాల్సిన 10 ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- FSSAI లోగో : ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్స్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లోగో ఉందో, లేదో చెక్ చేయాలి. ఆహార పదార్థాలపై FSSAI లోగో ఉంటే ఆ ప్రొడక్ట్ ప్రభుత్వం నిర్దేశించిన భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం.
- గడువు తేదీ : ఏదైనా ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు, దానిపై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ను తనిఖీ చేయాలి. గడువు తేదీ దాటిన ఆహారాన్ని తినడం తింటే అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉంటుంది.
- పోషకాహార సమాచారం : కేలరీలు, ఫ్యాట్, సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, చక్కెర, ప్రోటీన్స్ వంటి పోషకాల వివరాలు లేబులింగ్‌లో ఉంటాయి. వీటిని చూస్తే సదరు ప్యాకేజ్‌లో ఏయే పోషకాలు ఉన్నాయో తెలుస్తుంది.
- పదార్ధాల జాబితా : మీరు కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీకి ఏ పదార్థాలు వాడారో తెలుసుకోవాలి. అందులో ఏవైనా మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే పదార్థాలు ఉంటే, ఆ ఆహార పదార్థాన్ని కొనుగోలు చేయకపోవడం బెటర్.
- చక్కెర కంటెంట్ : అధిక చక్కెర కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు మీ అరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తక్కువ శాతం చక్కెర ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది.
- సర్టిఫికేషన్స్, లేబుల్స్ : ఆర్గానిక్, నాన్-జీఎంఓ, ఫెయిర్ ట్రేడ్, గ్లూటెన్-ఫ్రీ వంటి నిర్దిష్ట ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్టిఫికేషన్స్ ఉపయోగపడతాయి. నాణ్యతకు, ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఉత్పత్తులు గురించి లేబుల్స్ చూసి తెలుసుకోవచ్చు.
- బెస్ట్ బిఫోర్ యూజ్ డేట్ :ఇది ఆహార పదార్థాల ఎక్స్‌పైరీ డేట్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. బెస్ట్ బిఫోర్ డేట్ అంటే ప్రొడక్ట్ ఈ తేదీ ముందు వరకు మంచి రుచిగా ఉంటుందని అర్థం. ఒక వేళ ఈ గడువు దాటితే ఆహార పదార్థాల రుచి కొంత తగ్గొచ్చు.
- లో సోడియం లేబుల్ : బీపీ, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తిలో ఎంత సోడియం ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు.
- వెజిటేరియన్/ వీగన్ లేబుల్ :ఈ లేబుల్ శాఖాహారులకు, వీగన్‌లకు చాలా ముఖ్యమైనది. మీరు కొనే ఆహార పదార్థాల్లో మాంసాహారం, పాల ఉత్పత్తులు ఉన్నాయో, లేదో నిర్ధరణ చేసుకునేందుకు ఈ లేబుల్ ఉపయోగపడుతుంది.
- సర్వింగ్ సైజు :సర్వింగ్ సైజును, సంఖ్యను కూడా తనిఖీ చేయాలి. ఇది మీ ప్యాకేజ్డ్ ఫుడ్‌కు సంబంధించిన పోషకాహార సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సాయపడుతుంది.