Kolkata Doctors Protest: బంగాల్లో జూనియర్ డాక్టర్లు తమ విధులను పూర్తిగా బహిష్కరించి మళ్లీ నిరసన బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని వైద్యసంస్థల వద్ద జూనియర్ డాక్టర్లకు భద్రత, కోల్‌కతా హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం ఆందోళన చేపట్టారు. కాగా, 42 రోజులపాటు నిరసనలు చేపట్టిన ట్రైనీ డాక్టర్లు సెప్టెంబరు 21న పాక్షికంగా విధుల్లో చేరారు. మళ్లీ నిరసనలకు దిగారు.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరవు
"వైద్యుల భద్రత, మరికొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి బంగాల్ సర్కార్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదు. ఆగస్టు 9 నుంచి నిరసనలు మొదలుపెట్టాం. ఇప్పటికి 52 రోజులు అవుతున్నాయి. ఇంకా జూనియర్ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. మంగళవారం నుంచి పూర్తిగా విధులను బహిష్కరించి నిరసనలకు దిగుతున్నాం. అంతకుమించి వేరే మార్గం మాకు కనిపించడం లేదు. మా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే, నిరసనలు కొనసాగిస్తాం" అని ఆందోళనల్లో పాల్గొన్న జూనియర్ డాక్టర్ అనికేత్ మహతో తెలిపారు.
మార్చ్‌కు జూనియర్ డాక్టర్లు పిలుపు
మరోవైపు, జూనియర్ వైద్యులు బుధవారం సెంట్రల్ కోల్‌కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ధర్మతల వరకు మార్చ్‌కు పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మార్చ్‌లో తమతో కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, తమ భద్రత, రాజకీయ ఒత్తిళ్లు, హత్యాచార బాధితురాలికి న్యాయంపై ప్రభుత్వం సరైన హామీ ఇవ్వకపోతే, మంగళవారం నుంచి చేపట్టిన నిరసనలు కొనసాగిస్తామని మరో ప్రకటనలో జూనియర్ వైద్యుల ఫ్రంట్ తెలిపింది.
వైద్యులు డిమాండ్లు ఇవే!
అవినీతి, విధుల్లో అలసత్వం చూపిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్శదర్శిని తొలగించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో డిజిటల్ బెడ్ వేకెన్సీ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ రిఫరల్ సిస్టమ్, సీసీటీవీ, ఆన్ కాల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, అలాగే శాశ్వతంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.