Bengal Governor Molestation Issue : బంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక ఆరోపణలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన గవర్నర్, తనపై వచ్చిన నిరాధార ఆరోపణలపై పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చి సొంత రాష్ట్రమైన కేరళకు బయలుదేరారు. ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నట్లు అధికారులు తెలిపారు. "రాజ్‌భవన్‌లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దూరారు. వారు దురుద్దేశంతో ప్రతిష్ఠను భంగం చేయాలనే వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనిపై వివిధ సంస్థలు సైతం దర్యాప్తు చేపట్టాయి. ఇవన్నీ కేవలం ఎన్నికల కోసం వేసిన ప్లాన్లు మాత్రమే." అని ఆనంద్ బోస్ చెప్పారు. అయితే, గవర్నర్‌పై మహిళ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే రాజ్‌భవన్ ఇలాంటి అనుమానం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు ఈ వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించింది రాజ్‌భవన్ కార్యాలయం. "ఇద్దరు అసంతృప్త ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అసత్య కథనాలు ప్రచారం చేశారు. నిజం గెలుస్తుంది. సృష్టించిన కథనాలకు నేను భయపడను. ఎవరైనా నన్ను కించపరిచి ఎన్నికల ప్రయోజనాలు పొందాలనుకుంటే వారిని దేవుడే చూసుకుంటాడు. కానీ బంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు" అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇవీ ఆరోపణలు
అంతకుముందు గురువారం రాజ్‌భవన్‌లో తాత్కాలిక విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని గవర్నర్ హౌస్ ప్రాంగణంలోని పోలీస్‌పోస్టులో ఈ వేధింపుల గురించి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దాంతో ఆమెను స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా ఆమె అక్కడ ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో గవర్నర్ తనను పలుమార్లు వేధించారని అందులో ఆరోపించారు.