Avik Das Takes Admission In IISC : ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు దేశంలోని టాప్ ఐఐటీల్లో సీటు సాధించాలనుకుంటారు. అలాగే వైద్య కోర్సుల కోసం నిర్వహించే నీట్ యూజీ ఎగ్జామ్‌కు సన్నద్ధమయ్యేవారు మంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాలనుకుంటారు. అయితే ఈ రెండు పరీక్షలకు ఒకేసారి హాజరయ్యే విద్యార్థులు కొందరు ఉంటారు. ఈ రెండు పరీక్షల్లో దేనికి మంచి ర్యాంకు వస్తే అటువైపు వెళ్లిపోతారు.
కాగా, బంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. అయినా ఐఐటీ, మెడికల్ కాలేజీలో చేరలేదు. పరిశోధనలపై మక్కువతో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ (IISC) బెంగళూరులో అడ్మిషన్ తీసుకున్నార. ఎందుకు ఆ విద్యార్థి ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకుందాం.
అంతా షెడ్యూల్ ప్రకారమే!
బంగాల్లోని అలీపుర్ దువార్కు చెందిన అవిక్ దాస్(17) కోటాకు చెందిన అలెన్ డిజిటల్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. తన విజయానికి ఆన్లైన్ కోచింగ్ కూడా ఓ కారణమని అవిక్ చెప్పుకొచ్చాడు. ప్రిపేర్ అయినప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే కొన్ని గంటల్లోనే టీచర్స్‌ను అడిగి పరిష్కరించుకునేవాడు. అవిక్ ఎక్కువగా చదవడానికి ఇష్టపడేవాడు. ఆన్ లైన్ కోచింగ్ తర్వాత కాసేపు చదివి రివిజన్ చేసేవాడు. రోజంతా చదవడానికి షెడ్యూల్ వేసుకునేవాడు. అవిక్ ఆన్లైన్లో ప్రిపేర్ అయినా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్లే దానికి బాసిస అవుతామని అలా దూరంగా ఉన్నాడట. సోషల్ మీడియా చదువుపై ప్రభావం చూపుతుందని అలా చేశాడట. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి రాత్రి 12 గంటల వరకు చదివేవాడు.
అన్నింట్లో టాపర్
"మొదటి ప్రయత్నంలోనే కష్టతరమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అవిక్ దాస్ 360కి 307 మార్కులు సాధించాడు. ఆల్ ఇండియా స్థాయిలో 69వ ర్యాంకు వచ్చింది. అలాగే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీలో 720కి 705 మార్కులు సంపాదించాడు. అల్ ఇండియా స్థాయిలో దీంట్లోనూ 200 కంటే తక్కువ ర్యాంక్‌ను సాధించాడు. బంగాల్ స్టేట్ బోర్డులో అవిక్ దాస్ 99.2 శాతం స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచాడు. బంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (WB-JEE)లో అవిక్ ఏడో స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో గువహటి జోన్లో టాపర్‌గా నిలిచాడు" అని అవిక్ ఆన్లైన్ కోచింగ్ మెంటర్ గౌరవ్ శర్మ తెలిపారు.