Paralympics 2024 Thulasimathi Murugesan : లక్ష్య సాధనకు శిక్షణ, మానసిక, శారీరక సమస్యలు అడ్డంకులు కావని నిరూపించింది తమిళనాడుకు చెందిన తులసిమతి మురుగేశన్. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి సత్తా చాటింది. ఇక్కడితో తన ప్రయాణం ఆపనంటోంది. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమంటున్న తులసిమతి తండ్రి మురుగేశన్ ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె పడిన కష్టాలను, ఇబ్బందులను షేర్ చేసుకున్నారు.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తులసిమతి జన్మించింది. పుట్టుకతో ఎడమ చేతికి వైకల్యం ఉంది. అయితే ఆ లోపాన్ని చూస్తూ కూర్చోకుండా లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగింది. అందుకు అమె తండ్రి మద్ధతు కూడా లభించింది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో చైనా గడ్డపై బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన ఆమె, తాజాగా పారాలింపిక్స్‌లో విభాగంలో రజత పతకం సాధించింది. ఈసారి గురి తప్పినా తన కుమార్తె వచ్చే పారాలింపిక్స్‌లో తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని మురుగేశన్ ధీమా వ్యక్తం చేశారు. తులసిమతి క్రీడల్లో రాణిస్తూనే వెటర్నరీ మెడిసిన్ చదువుతుందని ఆయన తెలిపారు.
''తులసిమతి బ్యాడ్మింటన్‌లో కష్టపడి ప్రాక్టీస్ చేసి పారాలింపిక్స్ వరకు వెళ్లింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. తులసిమతి ప్రస్తుతం వెటర్నరీ మెడిసిన్ చదువుతుంది. పారాలింపిక్స్ కోసం శిక్షణ ఇచ్చేందుకు 45 రోజుల సమయం కావాల్సి వచ్చింది. ఈ విషయం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఆయన మాకు సహాయం చేశారు. తమిళనాడు రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థతో పాటు ఉదయనిధి సహాయం మరువలేనిది'' అని మురగేశన్ తెలిపారు.