Uttarakhand UCC Bill Draft :ఉత్తరాఖండ్ శాసనసభలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రవేశపెట్టారు. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం కోసమే నాలుగు రోజులపాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేశారు. సీఎం ధామి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయగా, బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కసరత్తు చేసిన కమిటీ గత శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్‌లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.
సహ జీవనానికి తల్లిదండ్రుల అనుమతి
ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక అంశాలను పొందుపరిచింది. ఉత్తరాఖండ్‌లో సహ జీవనంలో ఉండాలనుకుంటున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహ జీవనంలోకి చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని బిల్లులో స్పష్టం చేశారు. అయితే నైతికతకు విరుద్దంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయడం కుదరదని కూడా ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో స్పష్టం చేశారు. సహ జీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా, మైనర్ అయినా సహ జీవనం సంబంధాలు రిజిస్టర్ చేయబోరని స్పష్టం చేసింది.