Uttar Pradesh Accident Today :ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 8 చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో 35-40 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్ వెళ్తున్నారు. మార్గమధ్యలో గధయ్య గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. అందులో ఉన్న కొంత మంది ఈదుకుంటూ రోడ్డుకు చేరుకుని, స్థానికులను సహాయం కోరారు. వెంటనే స్థానికులు వెంటనే స్పందించి కొంతమందిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సీఎం దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.