UP Road Accident News Today : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు.
ఉన్నావ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 5.15 గంటలకు లఖ్‌నవూ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. అయితే ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ బస్సు బిహార్ నుంచి దిల్లీకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని ఉన్నావ్ డీఎం గౌరంగ్ రాఠీ తెలిపారు.
ముర్ము సంతాపం
ఉన్నావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ప్రమాదంలో అనేక మంది మరణించారనే వార్త బాధాకరం. ఆకస్మిక మరణానికి గురైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని ముర్ము ట్వీట్ చేశారు. మరోవైపు, మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందించనున్నట్లు పీఎంవో ట్వీట్ చేసింది.
సీఎం యోగి స్పందన
అయితే ఘోర రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు, ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పరామర్శించారు. సరైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది బిహార్‌కు చెందినవారు ఉన్నారని తెలిపారు. యూపీ ప్రభుత్వం బిహార్ సర్కార్‌తో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయని అన్నారు.