Union Budget 2024 Education :వచ్చే ఐదేళ్లలో 4.1కోట్లమంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 2లక్షల కోట్లు కేటాస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. విద్యా, ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం రూ. 1.48లక్షల కోట్లు ప్రతిపాదించారు. తమ ప్రభుత్వం విద్యా, ఉపాధి, నైపుణ్య శిక్షణపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కేంద్రప్రాయోజిత పథకం ద్వారా 20లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులకు రూ.10లక్షల రుణం
నైపుణ్యాభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో కోటి మంది యువతకు 500 కంపెనీల్లో ఇన్‌టర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దీనివల్ల నైపుణ్యం పెరుగుతుందని, ఇన్‌టర్న్‌షిప్ చేసేవారికే నెలకు రూ. 5వేల భృతి చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నతవిద్య కోసం రూ.10లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏటా లక్షలమంది విద్యార్థులకు 3శాతం వడ్డీతో ఈ-ఓచర్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
నెల జీతం బోనస్
అన్నిరంగాల్లో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ఒక నెల వేతనం 3 వాయిదాల్లో ఇస్తామని ప్రకటించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా గరిష్ఠంగా రూ.15వేలు చెల్లించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అది కూడా నెలకు రూ. లక్ష లోపు వేతనం ఉన్న వారికే అని తెలిపారు. దీనివల్ల 210లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. ఉత్పత్తి రంగంలో ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుందని చెప్పారు. మొదటిసారి ఉపాధి పొందిన ఉద్యోగులను లింక్ చేస్తుందని, ప్రత్యేక పథకం ద్వారా ప్రోత్సాహకాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తొలి నాలుగేళ్ల ఉద్యోగకాలంలో యజమాని, ఉద్యోగికి ఈపీఎఫ్ చందా ద్వారా నేరుగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన 30లక్షల మంది యువతకు ప్రయోజనం కలగనుందని వివరించారు నిర్మల.