Congress BJP War Of Words On UPS :కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్- (UPS)పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మూడోసారి అధికారం చేజిక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం, తమ నిర్ణయాలపై యూటర్న్ తీసుకుంటోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. యూపీఎస్‌లో 'యూ' అంటే 'యూనిఫైడ్' కాదని, 'యూటర్న్స్' అని ఎద్దేవా చేశారు.
"జూన్ 4 తర్వాత మూడోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది అప్పటి నుంచి తమ నిర్ణయాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతూ వస్తోంది. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది, బ్రాడ్‌కాస్ట్ బిల్లును వెనక్కి తీసుకుంది. లేటరల్ ఎంట్రీ ప్రకటన ఇచ్చి, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం వల్ల వెనక్కి తగ్గింది. తాజాగా యూపీఎస్ విషయంలోనూ అదే జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటోంది" అంటూ ఖర్గే ఎక్స్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు.
'మీరు ఇచ్చిన హామీల సంగతేంటి'
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. యూపీఎస్ తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారిందని, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.
"కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఒకే ఒక మాట అడగాలనుకుంటున్నా. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఎప్పుడు నెరవేరుస్తారు? ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామన్న హస్తం పార్టీ ఇచ్చిన హామీ కలగానే మిగిలిపోయింది. అది ఆచరణ సాధ్యం కాదని గ్రహించే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఈ అంశాన్ని చేర్చలేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్న సంగతిని ప్రజలు గ్రహించారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు" అని రవిశంకర్ కౌంటర్ ఇచ్చారు.
దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్-యూపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త స్కీమ్ వల్ల 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50శాతం పెన్షన్ అందనుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్‌పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. ఎన్‌పీఎస్ చందాదారులంతా యూపీఎస్‌లోకి మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2025 ఏప్రిల్ 1 నుంచి) యూపీఎస్ అమల్లోకి వస్తుంది
ఉద్యోగులకు యూనిఫైడ్ పింఛన్, విద్యార్థుల కోసం విజ్ఞాన ధార - కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయాలివే! - Union Cabinet 3 Decisions