ISRO SpaDeX Docking Mission :భారత స్పేడెక్స్ ఉపగ్రహాలు ఆదివారం మరింత దగ్గరయ్యాయి. శనివారం వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా, ఆదివారం నాటికి ఆ దూరం మొదట 15 మీటర్లకు చేరుకుంది. ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను 3 మీటర్ల దగ్గరకు తీసుకువచ్చి, ఆపై సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకువచ్చింది. డేటాను పూర్తిగా విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో తెలిపింది. ఆ ప్రస్తుతానికి శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ప్రస్తుతం అన్ని సెన్సర్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంది.
"ప్రస్తుతం SD01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసింది. ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను సురక్షితమైన దూరానికి తరలించాం. డేటాను విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతాం." - ఇస్రో ట్వీట్
షేక్ హ్యాండ్ కోసం
ఇంతకు ముందు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. రెండు ఉపగ్రహాల షేక్ హ్యాండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
"ప్రస్తుతం SD01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య దూరం 15 మీటర్ల మాత్రమే ఉంది. వాటి మధ్య మంచి ఉత్తేజకరమైన షేక్ హ్యాండ్ కోసం మనం కేవలం 50 అడుగుల దూరంలో ఉన్నాం. అవి రెండూ పరస్పరం స్టన్నింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాయి." - ఇస్రో ట్వీట్
డాకింగ్ ఎప్పుడు?
అయితే ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్) ఎప్పుడు చేపడతామన్నది మాత్రం ఇస్రో వెల్లడి చేయలేదు. వాస్తవానికి ఈ జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత దాన్ని ఇస్రో వాయిదా వేసింది. అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు అవసరమైన డాకింగ్ ప్రక్రియపై పట్టు సాధించే ఉద్దేశంతో, ఇస్రో డిసెంబర్ 30న ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు మాత్రమే. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం అయితే, ప్రపంచంలో ఈ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాల్గో దేశంగా భారత్ నిలవనుంది.