TTD Cancelled Some Services on June 21: నిత్య కల్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో.. జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. జూన్ 19 నుంచి జూన్ 21 వరకు మూడు రోజులపాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 21న అంటే.. రేపు పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో అలరారే శ్రీవారి, దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. దీనిని 1990 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో మూడు రోజుల పాటు ఈ క్రతువు నిర్వహిస్తారు.
మూడు రోజులు జరిగే కార్యక్రమాలు ఇవే: మొదటిరోజు ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.