Tribute To Ramoji Rao in Jaipur : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు రాజస్థాన్ రాజధాని జయపురలోని పింక్ సిటీ ప్రెస్ క్లబ్‌లో మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈటీవీకి చెందిన జర్నలిస్టులు, పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. మరోవైపు రామోజీరావుకు ఈటీవీ కన్నడలో పనిచేసిన జర్నలిస్టులు సంతాపం తెలిపారు. బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మీడియా మెఘల్ రామోజీరావుతో గడిపిన క్షణాలను జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు రామోజీరావు సాధించిన విజయాలు, వృత్తి నైపుణ్యం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
'రామోజీరావు రియల్ హీరో'
జర్నలిజం విశ్వసనీయతను ఈనాడు, ఈటీవీ బలోపేతం చేశాయని జయపురలోని పింక్ సిటీ ప్రెస్ క్లబ్‌లో వక్తలు వ్యాఖ్యానించారు. రామోజీ తన జీవితకాలంలో జర్నలిజంలో విలువలు కాపాడారన్నారు. ఈటీవీ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. టీవీ మీడియా నుంచి ఫిల్మ్ మేకింగ్ వరకు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అని సీనియర్ పాత్రికేయులు అమిత్ భట్ తెలిపారు. ఈటీవీలో పనిచేసిన వ్యక్తులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ మీడియా సంస్థల్లో కనిపిస్తారని పాత్రికేయులు సుధీర్ శర్మ వెల్లడించారు. మీడియాకు సాధికారత కల్పించడంలో రామోజీ నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. రామోజీరావు రియల్ హీరో అని సీనియర్ జర్నలిస్టు శశిమోహన్ శర్మ తెలిపారు. ఉపాధితో పాటు యువ జర్నలిస్టులకు ఆయన దిశానిర్దేశం చేశారని కొనియాడారు.
'ఆయన అన్ని రంగాల్లో విజయం సాధించారు'
'మనందరికీ రామోజీరావు సర్ నిజంగా అన్నదాతే' అని అన్నారు సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ ఉపాధ్యాయ. ప్రైవేట్ మీడియాలో రైతుల కోసం అన్నదాత లాంటి కార్యక్రమం చేసిన మొదటి వ్యక్తి రామోజీరావు అని బెంగళూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో కొనియాడారు. పచ్చళ్ల వ్యాపారం నుంచి మీడియా రంగం వరకు ఎన్నో రంగాల్లో రామోజీ విజయం సాధించారని గుర్తు చేసుకున్నారు. దశాబ్ద కాలంపాటు రామోజీరావుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర పుప్పాల తెలిపారు. ఒత్తిడిలో కూడా రామోజీ రావు వార్తలను, మీడియాను వక్రీకరించలేదని కొనియాడారు. మీడియా మెఘల్ రామోజీరావు సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్ పాత్రికేయులు శివ శంకర్ అన్నారు. అందుకే ఈటీవీ వార్తలను నమ్మదగినవి, విశ్వసనీయమైనవిగా ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.