తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్‌ను అవే దెబ్బకొట్టాయ్‌- పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవ్​: ఖర్గే - KHARGE CWC MEETING UPDATES

EVMలపై అనేక అనుమానాలున్నాయ్​ - సీడబ్య్సూసీ సమావేశంలో ఖర్గే

Mallikarjun Kharge
Mallikarjun Kharge (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 6:59 PM IST

Kharge CWC meeting updates :కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు అవసరమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఈవీఎంలపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓటమికి కారణాలివే!
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్‌ లోతుగా విశ్లేషిస్తోంది. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయని, ఈ విషయంలో కఠిన క్రమశిక్షణ అవసరమని ఖర్గే అభిప్రాయపడ్డారు. కలిసికట్టుగా పోరాడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులను ఎలా ఓడించగలం? అని ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్న ఖర్గే, ఈ ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పార్టీ నేతలకు హితబోధ చేశారు.

క్రమశిక్షణే ఆయుధం
"పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి. ఇదే మన ఆయుధం. పార్టీ విజయమే తమ గెలుపు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. పార్టీ బలంపైనే మన శక్తి ఆధారపడి ఉంటుందని భావించాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన పనితీరుతో నూతనోత్సాహంతో పునరాగమనం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం పార్టీ ఆశించినట్లుగా లేవు. ఇండియా కూటమి పార్టీలు నాలుగు రాష్ట్రాలకు గాను రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ మన పార్టీ పనితీరు ఆశించిన విధంగా లేదు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌గా మారతుంది" అని ఖర్గే తేల్చి చెప్పారు.

ఈవీఎంలతో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదం!
"సమయానుకూలంగా వ్యూహరచన చేసి పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా మరింతగా కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికలకు కచ్చితంగా ఏడాది ముందు నుంచే సిద్ధం కావాలి. ఓటర్ల జాబితాలను పరిశీలించాలి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (EVM) ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా ఎలక్షన్ కమిషన్​ వ్యవహరించాలి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి సాధించిన ఫలితాలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని ఫలితాలు చూసి రాజకీయ విశ్లేషకులు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు" అని ఖర్గే అన్నారు.

ఈ ఫలితాలు మనకు కుదుపే
"కాంగ్రెస్ కచ్చితంగా ఎన్నికల వ్యూహాన్ని మెరుగుపరుచుకోవాలి. క్యాంపెయిన్‌ను మెరుగుపరిచేందుకు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన మార్గాలను అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో ప్రజల ఎజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇది పెద్ద కుదుపే అని చెప్పవచ్చు. కనుక పార్టీ బలోపేతానికి కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఫలితాలతో నిరాశ చెందడం కాకుండా, పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి ఏఐసీసీ వరకు మార్పులు తీసుకురావాలి" అని ఖర్గే సూచించారు.

ABOUT THE AUTHOR

...view details