తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇండియా కూటమి కెప్టెన్సీకి దీదీ రెడీ- SP, శివసేన మద్దతు- కాంగ్రెస్ ఫైర్! - MAMATA BANERJEE INDIA CHIEF

ఇండియా కూటమికి సారథ్యం మమత సిద్ధం- మిత్రపక్షాల నుంచి విభిన్న స్పందన

Mamata Banerjee INDIA Chief
Mamata Banerjee, Mallikarjun kharge (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2024, 5:30 PM IST

Mamata Banerjee INDIA Chief: ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్న బంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనపై భాగస్వామ్య పక్షాల నుంచి మిశ్రమస్పందన వ్యక్తమవుతోంది. భాగస్వామ్య పక్షాలు కోరితే ఇండియా కూటమికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ పేర్కొనటంతో చర్చ మొదలైంది. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉందన్నారు.

మమతాకి ఆ సామర్థ్యం ఉందా?
కాంగ్రెస్‌ సరైన ప్రదర్శన చేయకపోతే తానేం చేయలేనంటూ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మమతా బెనర్జీ అన్నారు. బంగాల్ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. జాతీయస్థాయి బాధ్యతలకు సంబంధించి మమతాబెనర్జీ సామర్థ్యాన్ని ప్రశ్నించింది. బంగాల్‌లో వరుసగా 3సార్లు అధికారం చేపట్టినప్పటికీ దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తుచేసింది. బంగాల్‌ను దాటి పార్టీని విస్తరించలేని సీఎం జాతీయస్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఎలా రాణించగలరని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు.

కూటమి బాధ్యతలు దీదీకే
అయితే దీదీ ప్రకటనను కూటమిలోని కీలక పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్‌ వర్గాలు సమర్థించాయి. కూటమి బాధ్యతలు మమతకు అప్పగించాలనే విషయంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాయి. బంగాల్‌లో బీజేపీని ఆమె ఒంటరిగా, ఎంతో సమర్థంగా నిలువరిస్తున్నారని ఎస్​పీ నేతలు ప్రశంసించారు. కూటమిలో మమతాబెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. త్వరలోనే మిత్రపక్షాలతో కలిసి కోల్‌కతాకు వెళ్లి దీదీతో భేటీ కానున్నట్లు చెప్పారు. ఇండియా కూటమి సమావేశం జరిగినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు రౌత్‌ తెలిపారు.

మిత్రపక్షాలకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేదు
బంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టకుండా చేయటంలో మమత బెనర్జీ విజయవంతం అయ్యారని ఆ పార్టీకి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. బిహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ కూటమికి నేతృత్వం వహించేందుకు సరైన నాయకుడవుతారని ఆర్​జేడీ అభిప్రాయపడింది. హరియాణా, మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇండియా కూటమి సారథ్యం వహిస్తున్న ఆ పార్టీ మిత్రపక్షాలకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేదని దుయ్యబట్టారు.

అవినీతి వంశాలను కాపాడటమే లక్ష్యం : బీజేపీ
ఇండియా కూటమిలో మొదలైన అంతర్గత పోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటంతోపాటు రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ను ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతోంది. మోదీని ఓడించటం తప్ప మరే ఉమ్మడి అజెండా లేని గ్రూపుగా ఇండియా కూటమిని అభివర్ణించింది. ఏకాభిప్రాయం లేని వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని వాగ్బాణాలు సంధించింది. అధికారదాహం, అవినీతి వంశాలను కాపాడటమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తోంది.

'కేంద్రం ఆధార్​ కార్డులను డీయాక్టివేట్​ చేస్తుంది'- బంగాల్​ సీఎం దీదీ ఆరోపణలు

కాంగ్రెస్‌తో పొత్తు లేదు- దిల్లీలో ఆప్ ఒంటరి పోరు: అరవింద్‌ కేజ్రీవాల్‌

ABOUT THE AUTHOR

...view details