తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి అంత్యక్రియల కోసం అన్నదమ్ముల గొడవ- మృతదేహాన్ని 2 ముక్కలు చేయమన్న పెద్ద కొడుకు! - TIKAMGARH LAST RITES DISPUTE

తండ్రికి అంత్యక్రియలపై అన్నదమ్ముల వాగ్వాదం- మృతదేహాన్ని రెండు ముక్కలు చేయమన్న పెద్ద కొడుకు- మధ్యప్రదేశ్‌లోని తీకంఘర్‌లో ఘటన

Tikamgarh Last Rites Dispute
Tikamgarh Last Rites Dispute (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 12:16 PM IST

Tikamgarh Last Rites Dispute :తండ్రి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయంపై ఆ ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒక సోదరుడు తండ్రి భౌతిక కాయాన్ని రెండు ముక్కలు చేసి అంత్యక్రియలు చేయాలని డిమాండ్ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని తీకంఘర్ జిల్లా జతారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిధౌరా తాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వచ్చీ రాగానే రాద్ధాంతం

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,లిధౌరా తాల్ గ్రామానికి చెందిన ధ్యాని సింగ్ ఘోష్ వయసు 85 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దామోదర్ వద్దే ధ్యాని సింగ్ ఉండేవాడు. ఇటీవలే ఆయన కన్నుమూశారు. దీంతో చిన్న కుమారుడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఈ తరుణంలో ధ్యాని సింగ్ ఘోష్ పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్ వచ్చీ రాగానే రాద్ధాంతం మొదలుపెట్టాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానంటూ పట్టుబట్టాడు. పెద్ద కొడుకును కాబట్టి ఆ హక్కు తనకే ఉంటుందని వాదించాడు. అయితే అందుకు తమ్ముడు దామోదర్ అంగీకరించలేదు. తండ్రి తుదిశ్వాస దాకా తన వద్దే ఉన్నందున, అంత్యక్రియలను నిర్వహించే హక్కు తనకే ఉంటుందన్నాడు. చివరి నిమిషం వరకు తండ్రికి తానే సపర్యలు చేశానని దామోదర్ చెప్పాడు.

రెండు ముక్కలు చేసి!
ఈ విషయంపై అన్నదమ్ములు కిషన్, దామోదర్ మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామస్థులు, బంధువులు వారించినా కిషన్ వినిపించుకోలేదు. తమ్ముడితో కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడు ససేమిరా అన్నాడు. చివరకు అతడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి, విడివిడిగా అంత్యక్రియలు చేసుకునేందుకు తాను సిద్ధమన్నాడు. దీంతో పలువురు ఈ విషయంపై జతారా పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ అన్నదమ్ములకు నచ్చజెప్పారు. దీంతో కిషన్, దామోదర్ కలిసి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించారు. పోలీసు బందోబస్తు నడుమ ధ్యాని సింగ్ ఘోష్ అంత్యక్రియలను పూర్తి చేసినట్లు జతారా పోలీస్ స్టేషన్ ఇన్‌‌ఛార్జ్ అరవింద్ సింగ్ డాంగి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details