Thanka Anki Sabarimala 2024 :శబరిమలలో అయ్యప్ప మండల పూజ కోసం 'తంకా అంకి' (బంగారు ఆభరణాలు) తీసుకెళ్లే ఉత్సవ ఊరేగింపు ఆదివారం పతనంతిట్టలోని అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరింది. ఈ నెల 25వ తేదీ(బుధవారం) వరకు ఈ తంకా అంకి ఊరేగింపు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు అలంకరించి, ఆ తర్వాత దీపారాధన చేస్తారు. దీంతో తంకా అంకి కార్యక్రమం ముగుస్తుంది.
మార్మోగిన అయ్యప్ప నామం
పార్థసారథి ఆలయంలో ఆదివారం ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య తంకా అంకిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం 7 గంటల సమయంలో తంకా అంకి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు, ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారులు పాల్గొన్నారు. 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ మంత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు.
'బుధవారం నాటికి అయ్యప్ప సన్నిధానానికి చేరిక'
"ఆదివారం ఉదయం పార్థసారధి ఆలయం నుంచి తంకా అంకి ఊరేగింపు ప్రారంభమైంది. మార్గంలో 74 ఆలయాల దగ్గర ఈ ఊరేగింపు ఆగుతుంది. డిసెంబర్ 25 నాటికి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ ఉత్సవ ఊరేగింపు పంబాకు చేరుకోగానే దేవస్వమ్ మంత్రి వీఎన్ వాసవన్ స్వాగతం పలుకుతారు." అని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.