Terrorist Attack On Army Vehicle :జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ పర్యటక ప్రాంతమైన గుల్‌మార్గ్ సమీపంలో గురువారం సాయంత్రం నాగిన్ పోస్టు వైపు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలతోపాటు ఇద్దరు సైనికులు కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే రెండు వర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు కూడా కొనసాగినట్లు శ్రీనగర్‌కు చెందిన చినార్ దళం ఎక్స్‌లో పేర్కొంది. గురువారం ఈ దాడి ఘటనకు ముందు పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలోనూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభంకుమార్ అనే కార్మికుడు గాయపడ్డాడు.
తీవ్ర ఆందోళన కలిగించే విషయం!
ఆర్మీ వాహనంపై దాడి జరగడం దురదృష్టకరమని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఇటీవల వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమరవీరుల త్యాగం వృథా కాదు!
బూటపత్రి సెక్టార్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడానని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని మట్టుబెట్టడానికి ఆపరేషన్ సిద్ధమైందని తెలిపారు. అమరవీరుల త్యాగం వృథా కాదని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు.
సైనికులను ఎదుర్కొనే ధైర్యం ఉగ్రవాదులకు లేదు!
కశ్మీర్‌లో శాంతిని అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు. ఆర్మీ వాహనంపై పిరికిపంద పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. కశ్మీర్‌లో శాంతిని అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ పదే పదే ప్రయత్నిస్తోందని అన్నారు. భారత సైనికులను ఎదుర్కొనే ధైర్యం ఉగ్రవాదులకు లేదని, అందుకే రాత్రిసమయాల్లో వారిపై దాడి చేశారన్నారు. ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.