Tamil Actor Vishal Political Party : తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ప్రముఖ తమిళ హీరో విశాల్ స్పందించారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో రావడం లేదని స్పష్టం చేశారు. తనకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. "నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా. విద్యార్థులను చదవిస్తున్నా. రైతులకు సాయం చేశా. లాభాలను ఆశించి ఏ పనిచేయబోను. ఇపుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా " అని అందులో పేర్కొన్నారు.
అంతకుముందు విశాల్ కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని 'విశాల్ మక్కల్ నల ఇయక్కం' (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జులను నియమించారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే విశాల్ మక్కల్ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు వార్తలు వచ్చాయి. వారితో మాట్లాడి పార్టీని విశాల్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. విజయ్లాగే విశాల్ కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలవరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని కథనాలు వచ్చాయి.
అంతకుముందు ఆయన రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వదంతులేనని విశాల్ స్పష్టం చేశారు. "నేను రాజకీయాల్లోకి రావడం తథ్యం. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కుప్పం, ఆ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది. అక్కడ మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారు. మూడేళ్లపాటు అక్కడే ఉన్నా" అని ఆయన చెప్పారు.