Supreme Court Diamond Jubilee Modi Speech : విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ అభ్యాసాలకు అనుగుణంగా దేశంలోని చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా చేసిన మూడు నేరచట్టాల వల్ల దేశంలోని న్యాయ, పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు కొత్తయుగంలోకి ప్రవేశించాయని చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో మోదీ ప్రసంగించారు.
"వికసిత్ భారత్‌లో సాధికార న్యాయ వ్యవస్థ ఒక భాగం. విశ్వసనీయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. జన్ విశ్వాస్ బిల్లు ఈ దిశలో ఒక అడుగు. భవిష్యత్తులో ఈ బిల్లు న్యాయవ్యవస్థపై అనవసరమైన భారాన్ని తగ్గిస్తుంది. ప్రతి పౌరుడు సులభంగా న్యాయాన్ని పొందడానికి అర్హుడు"
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
"ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్ పైనే ఉంది. మన దేశంపై విశ్వాసం పెరుగుతోంది. న్యాయానికి ప్రతి పౌరుడు అర్హుడు. ప్రతి పౌరుడికి సులభంగా న్యాయం అందేలా చేయడమే భారత్ ప్రాధాన్యం. అలా చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన మాధ్యమం. ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనంలో సమస్యలన్నీ నాకు తెలుసు. అత్యున్నత న్యాయస్థానం భవన సముదాయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం రూ.800 కోట్లను విడుదల చేసింది" అని తెలిపారు మోదీ.