తెలంగాణ

telangana

అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టు బెయిల్ - Kejriwal Bail Verdict

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:50 AM IST

Updated : Sep 13, 2024, 12:16 PM IST

Kejriwal Bail Verdict : మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Kejriwal Bail Verdict
Kejriwal Bail Verdict (ANI)

Kejriwal Bail Verdict :మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కానున్నారు.

మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ, బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ కొన్నిరోజుల క్రితం కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది.

'సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు'
ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లే. ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదు. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి వ్యక్తికి 'బెయిల్ అనేది నిబంధన- జైలు మినహాయింపు'గా ఉండాలి అని మరోసారి వెల్లడించింది.

సత్యమేవ జయతే: ఆప్
కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజారు అయిన తర్వాత సత్యమేవ జయతే అంటూ ఆమ్​ ఆద్మీ పార్టీ పోస్ట్ పెట్టింది. అబద్ధాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం మళ్లీ విజయం సాధించిందని ఆప్ నేత మనీశ్​ సిసోదియా అన్నారు. నిజాన్ని ఇబ్బంది పెట్టగలరు, కానీ ఓడించలేరని ఆ పార్టీ నాయకురాలు ఆతిశీ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్​కు బెయిల్ మంజూరు చేసినందుకు సుప్రీంకోర్టుకు ఎంపీ రాఘవ్ చద్ధా కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే: బీజేపీ
"సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో జైల్‌ వాలా సీఎం కాస్తా బెయిల్ వాలా సీఎం అయ్యారు. దిల్లీ ప్రజలు కోరుతున్నట్టు సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలి. కాకపోతే ఆయనకు ఏ మాత్రం నైతికత కూడా లేదు కాబట్టి ఆ పని చేయరు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు రాజీనామా చేయాలని కేజ్రీవాలే చెప్పేవారు. ఇప్పుడు ఆయన ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చారు. ఆయన నిందితుడి కేటగిరీలో ఉన్నారు" అని బీజేపీ వ్యాఖ్యానించింది.

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో 2024 మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. అయితే సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. జూన్‌ 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేయడం వల్ల బయటకు రానున్నారు.

Last Updated : Sep 13, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details