Court Summons Arvind Kejriwal :ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. దిల్లీకి నీటి సరఫరాను అడ్డుకొనేందుకు హరియాణా పాలకులు యమునా నదిని విషపూరితం చేశారంటూ దిల్లీ ఎన్నికల వేళ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హరియాణా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యమునా నది నీటిని విషపూరితం చేసినట్లు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే చేసిన అసత్య వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు- ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం - COURT SUMMONS ARVIND KEJRIWAL
యమునా నదిలో నీరు తాగిన నయాబ్ సింగ్- మరి ఆ నీరు ఎందుకు ఉమ్మేశారని కేజ్రీవాల్ ఎద్దేవా!
![కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు- ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం Arvind Kejriwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2025/1200-675-23430890-thumbnail-16x9-aravind.jpg)
Published : Jan 29, 2025, 9:00 PM IST
ఫిబ్రవరి 17న విచారణ
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ రోజు విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (సీజేఎం) నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తన ఆరోపణల వెనుక ఉన్న కారణాలను వివరించాలని, హరియాణా ప్రభుత్వం యమునా నది నీటిని విషపూరితం చేస్తుందన్న వాదనలను ధ్రువీకరిస్తూ నివేదిక ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. అంతకుముందు కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమంటూ హరియాణా మంత్రి విపుల్ గోయల్ తీవ్రంగా స్పందించారు. "కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హరియాణా, దిల్లీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము ఊరికే విడిచిపెట్టం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం" అని మండిపడ్డారు.
నదిలో నీరు తాగిన నయాబ్ సింగ్
ఇదిలా ఉండగా దిల్లీ సరిహద్దుల్లో హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నదిలో నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని భయానికి గురిచేసేలా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. తాను ఈరోజు యమునా నది వద్ద నీరు తాగినట్లు తెలిపారు. సీఎం నయాబ్ సింగ్ నీరు తాగినట్లు ఉన్న వీడియోను 'ఎక్స్'లో పోస్టు చేసిన కేజ్రీవాల్, ఆ నీరు విషపూరితంగా ఉండటంతో నయాబ్ సింగ్ సైనీ నీటిని తాగినట్లు నటించి, ఆ తర్వాత ఆ నదిలోనే ఉమ్మేశారని పేర్కొన్నారు. అమ్మోనియా కాలుష్యంతో యమునా నదిలో నీరు దిల్లీ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని తాను చెబితే, తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని బెదిరించారన్నారు. తాము తాగలేని అదే విషపూరిత నీటిని దిల్లీ ప్రజలకు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఎప్పటికీ అలా జరగనివ్వనని పేర్కొన్నారు.