Sonia Gandhi Rajyasbha Election : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. ఆమెతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడం వల్ల ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మహావీర్ ప్రసాద్ వెల్లడించారు. ఐదు పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. ఇక గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో సభ్యురాలిగా కూడా సోనియా గాంధీ నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో సోనియా గాంధీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
రాజస్థాన్లో రాజ్యసభ సభ్యులు మన్మోసింగ్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ) పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 3తో ముగుస్తుంది. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా డిసెంబరులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పెద్దల సభకు రాజీనామా చేయడం వల్ల మూడో స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 115, కాంగ్రెస్కు 70 మంది సభ్యుల బలం ఉంది. రాజస్థాన్లో 10 రాజ్యసభ స్థానాలుండగా, తాజా ఫలితాల తర్వాత కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులున్నారు.