Sonia Gandhi On Census :వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ డిమాండ్ చేశారు. జనగణన జరగకపోవడం వల్ల దేశంలో దాదాపు 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో జీరో అవర్లో సోనియా గాంధీ తొలిసారి మాట్లాడారు.
"2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల 14కోట్ల మంది లబ్ధిదారులు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2013 సెప్టెంబరులో యూపీఏ హయాంలో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చాం. కొవిడ్ సంక్షోభ సమయంలో లక్షలాది పేద కుటుంబాలను ఆకలి నుంచి రక్షించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ఆధారంగానే లబ్ధిదారుల కోటాను నిర్ణయిస్తున్నారు."
--సోనియా గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ
దేశ చరిత్రలో ఇదే తొలిసారి : సోనియా గాంధీ
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటిసారి పదేళ్లకు ఒకసారి చేపట్టే జనగణన నాలుగేళ్లు ఆలస్యం అయ్యిందని సోనియా గాంధీ తెలిపారు. "2021కల్లా జనగణన చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికీ జనగణన ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఈ ఏడాది కూడా జనగణన జరగదని అర్థమవుతోంది. జనగణన జరగకపోవడం వల్ల 14 కోట్ల మంది అర్హతగల భారతీయులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద వారికి లభించాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నారు. జనగణనను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన వారందరికీ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలు అందేలా చూడాలి. ఆహార భద్రత ఒక ప్రత్యేక హక్కు కాదు. ఇది ప్రాథమిక హక్కు" అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013లో యూపీఏ సర్కార్ తీసుకొచ్చింది. ఈ చట్టం కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు 75 శాతం, పట్టణ ప్రజలకు 50 శాతం వరకు సబ్సిడీతో ఆహార ధాన్యాలను అందించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం లబ్దిదారులను దాదాపు 81.35 కోట్లుగా అంచనా వేసింది. ప్రస్తుతం ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది.