తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / bharat

సోనమ్​ వాంగ్​చుక్ డిటెన్షన్​పై రాజకీయ పార్టీలు గరం గరం- పోలీసుల చర్యను తప్పుబట్టిన రాహుల్​ - Sonam Wangchuk Detention Issue

Sonam Wangchuk Detention Issue : పర్యావరణ కార్యకర్త సోనమ్​ వాంగ్​చుక్​ను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఈ చర్యను పలు రాజకీయ పార్టీల నేతల తీవ్రంగా ఖండించారు. వాంగ్​చుక్​ను నిర్భందించడం అమోదయోగ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. లద్దాఖ్​ ప్రజల సమస్యలను బీజేపీ ప్రభుత్వం వినాలని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ కోరారు. వారి బాధల్ని వినకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.

Sonam Wangchuk Detention Issue
Sonam Wangchuk Detention Issue (ANI)

Sonam Wangchuk Detention Issue :పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఆయన మద్దతుదారులను దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనకు పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. సోనమ్​ వాంగ్​చుక్​ను అదుపులోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పర్యావరణ, రాజ్యాంగ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు వందల మంది లద్దాఖీలను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. రైతులపై ప్రధాని మోదీ పన్నిన చక్రవ్యూహం లానే ఇది కూడా విచ్ఛిన్నమవుతుందని ఎక్స్ వేదికగా విమర్శించారు. లద్దాఖ్‌ వాణిని ప్రధాని వినాలని సూచించారు. ఈ విషయంపై స్పందించిన సమాజ్​ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్, లద్దాఖ్​ ప్రజల బాధను వినాలని కోరారు. ప్రజల సమస్యలు వినకుండా బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.

అప్పుడు రాహుల్​ ఎందుకు స్పందించలేదు : బీజేపీ
ఈ విషయంలో కాంగ్రెస్​ స్పందనను కపట నాటకంగా బీజేపీ అభివర్ణించింది. దీనిపై రాహుల్​ గాంధీకి స్పందించాలనిపిస్తే, కోల్​కతాలో కార్టూనిస్ట్​పై చర్యలు తీసుకున్నప్పుడు, తమిళనాడులో సెటైరిస్ట్​లను జైల్లో పెట్టిప్పుడు ఆయన ఏం అయ్యారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్​ ప్రశ్నించారు.

దిల్లీ సీఎంను అడ్డుకున్న పోలీసులు
పోలీసులు అదుపులో ఉన్న సోనమ్​ వాంగ్​చుక్​ను కలిసేందుకు వచ్చిన దిల్లీ సీఎం ఆతిశీని, బవాన పోలీస్​ స్టేషన్​ ముందు పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్​ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

లద్దాఖ్​లో నిరసనలు
సోనమ్​ వాంగ్​చుక్​ నిర్బంధం తర్వాత లద్దాఖ్​లో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో లద్దాఖ్​లో లేహ్​ అపెక్స్​ బాడీ(ఎల్​ఏబీ), కార్గిల్​ డెమొక్రటిక్ అలియన్స్​(కేడీఏ) లద్దాఖ్​లో బంద్​కు పిలుపునిచ్చాయి.

హైకోర్టులో పిటిషన్
తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సోనమ్​ వాంగ్​చుక్​ దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ విషయాన్ని వెంటనే విచారించాలని కోర్టును కోరారు. అయితే మంగళవారం విచారించడానికి నిరాకరించిన కోర్టు, అక్టోబర్ 3న వాదనలు వింటామని చెప్పింది.

ఇదీ జరిగింది
సోనమ్‌ వాంగ్‌చుక్‌ను, ఆయన మద్దతుదారులను దిల్లీలోని సింఘ్‌ సరిహద్దుల్లో సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తర, మధ్య దిల్లీ ప్రాంతాల్లో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడదని ఆరు రోజుల పాటు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ మార్చ్ నిర్వహించడం వల్ల అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అయితే వారిలో మహిళలు లేరని స్పష్టం చేశారు.

మరోవైపు, పోలీసులు తనను నిర్భందించారని సోనమ్ వాంగ్‌చుక్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. తనను, 150మంది మద్దతుదారులను నిర్భందించారని పేర్కొన్నారు. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం సహా పలు డిమాండ్లతో వాంగ్‌చుక్‌, ఆయన మద్దతుదారులు గత నెల ఒకటిన 'దిల్లీ చలో'కు పిలుపునిచ్చారు. దిల్లీ సరిహద్దుల్లోకి రాగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

లద్దాఖ్​ ప్రజల డిమాండ్లివే
లేహ్​ అపెక్స్​ బాడీ(ఎల్​ఏబీ), కార్గిల్​ డెమొక్రటిక్ అలియన్స్​(కేడీఏ) గత నాలుగేళ్లుగా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నాయి. లద్దాఖ్​కు రాష్ట్ర హోదా, రాజ్యాంగం ఆరో షెడ్యూల్​లో లద్దాఖ్​ను చేర్చడం, ప్రత్యేక పబ్లిక్​ సర్విస్​ కమిషన్, లేహ్​, కార్గిల్​ను సెపరేట్​ లోక్​సభ స్థానాలుగా చేయడం వంటి డిమాండ్లతో ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమంలో సోనమ్​ వాంగ్​చుక్​ కీలకంగా ఉన్నారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details