Chamala Kiran Kumar Reddy On Musi River Issue : మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతుండడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విష ప్రచారంపై చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను హెచ్చరించిన చామల 10 సంవత్సరాలలో మీరు చేయలేనిది 10 నెలల్లో తాము ఏమి చేయగలమని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసిన బీఆర్‌ఎస్ నాయకులను జిల్లాలో తిరిగినివ్వరని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు చిల్లర మాటలు నమ్మ వద్దని సూచించారు. బావా బామ్మర్దులు ఇద్దరు సినిమా యాక్టర్ల కంటే మించిపోయారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం బీఆర్ఎస్ నాయకులకు పరిపాటి అయిందని ద్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 28 వేల కట్టడాలు అక్రమంగా ఉన్నాయని, వాటిని కూల్చివేసేందుకు సహకరించాలని కోరిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. వర్షాకాలం హైదరాబాద్‌లో ప్రజలు ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విషం చీమ్ముతున్నాయని విమర్శించారు. మానవ తప్పిదాలు, స్వార్ధ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తుండడంతో నేడు కాలుష్య కారకమై దేశంలోనే అత్యంత ప్రమాదకర నదుల సరసన చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ కు మంచి పేరు రాకూడదనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు, మహిళలకు రుణాలు, పిల్లల చదువులకు బాధ్యత తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. మూసీని ప్రక్షాళించకపోతే హైదరాబాద్ కు భారీ నష్టం తప్పదన్న చామల ఏటా వర్షాకాలంలో పడవల్లో తిరగాల్సి వస్తుందని వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూసీ కలుషిత నీటి మూలంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి జరుగుతుంటే పార్టీలు అండగా నిలవాలన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మూసీ ప్రక్షాళన చేయకపోతే హైదరాబాద్‌కు నష్టం. ఏటా వరదలు వస్తే పడవల్లో తిరగాల్సిందేనా. కాంగ్రెస్ మంచి కార్యక్రమాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల సహాయ సహకారాలు కావాలి. ప్రజలకు మంచి జరుగుతుంటే పార్టీలు అండగా నిలవాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు"-చామల కిరణ్‌కుమార్, భువనగిరి ఎంపీ