Siddaramaiah Muda Case Plots Return : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి, తనకు మైసూర్ ప్రాంతంలో ఇచ్చిన 14స్థలాలను మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)కి తిరిగి ఇచ్చేశారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ద్వారా వెల్లడించారు. ముడా కేటాయించిన స్థలాలను తిరిగి ఇచ్చేయాలన్న తన భార్య నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.
'ముడా తీసుకున్న తమ భూమికి పరిహారంగా ఇచ్చిన స్థలాలను నా భార్య తిరిగి ఇచ్చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ఫిర్యాదులు సృష్టించి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా నిర్ణయం. కానీ, రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలు అయ్యింది. నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకుండా, కుటుంబ బాధ్యతలకే నా భార్య పరమితమైంది. ఇప్పుడు ఇలాంటి విద్వేష రాజకీయాలకు గురై మానసిక క్షోభను అనుభవిస్తోంది' అని సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తప్పు ఒప్పుకున్నట్లే
ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై విమర్శల దాడిని తీవ్రం చేసింది కర్ణాటక బీజేపీ. సీఎం సిద్ధరామయ్య సతీమణి 14 స్థలాలను తిరిగి ఇచ్చి వేయటం ద్వారా తప్పు చేసినట్లు ఒప్పుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర అన్నారు. ఇలా చేయడాన్ని రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. కోర్టు నుంచి తప్పించుకోవటమే దీని ఉద్దేశమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయటానికి ముందు, కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారంటూ చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని విజేంద్ర డిమాండ్ చేశారు.
ఇదీ కేసు
సిద్ధరామయ్య భార్య బీఎమ్ పార్వతికి చెందిన భూములను ముడా అభివృద్ధి అవసరాల కోసం తీసుకుంది. అందుకు బదులుగా మైసూరులోని వేర్వేరు ప్రాంతాల్లో 14 చోట్ల స్థలాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి సూచనలతోనే ఆయన సతీమణికి విలువైన స్థలాలను ముడా కేటాయించిందని గవర్నర్‌కు ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.45 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించగా రాజకీయ దుమారం చెలరేగింది.