Mixing Urine In Fruit Juices :ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో ఓ వ్యక్తి పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడన్న ఆరోపణ ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. దీంతో కస్టమర్లు జ్యూస్ షాపు యజమానిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాపు యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
గాజియాబాద్‌లోని బోర్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్‌ను ఆమిర్ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతడు జ్యూసుల్లో మానవ మూత్రం (యూరిన్) కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజలను ఆమిర్ ఖాన్‌ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల నుంచి ఆమిర్ ఖాన్‌ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసే మైనర్‌ను స్టేషన్‌కు తరలించారు.
'మూత్రంతో నిండిన సీసా దొరికింది'
కాగా ఈ ఘటనపై గాజియాబాద్ ఏసీపీ భాస్కర్ వర్మ స్పందించారు. ఆమిర్ ఖాన్ అనే వ్యక్తి తన జ్యూస్ పాయింట్లో పండ్ల రసాల్లో మానవ మూత్రం కలిపి అమ్ముతున్నారని ఫిర్యాదు అందిందని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, మూత్రంతో నిండిన పెద్ద సీసా లభించిందని వెల్లడించారు. దానిని టెస్టులకు పంపామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టామని వివరించారు. మూత్రంతో నిండిన సీసా గురించి యజమానిని ప్రశ్నించినా, అతడి నుంచి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అన్నారు. తప్పు జరిగినట్లు తేలితే జ్యూస్ షాపు యజమాని ఆమిర్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ భాస్కర్ వర్మ తెలిపారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాగా, జ్యూసుల్లో మానవ మూత్రం కలిపి విక్రయించడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అందుకే జ్యూస్ షాపు యజమానిని చితకబాదారు. ఈ దాడి వీడియోను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? దుకాణదారుడి వ్యక్తిగత చర్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.