Renuka Swamy Murder Case Update :కర్ణాటకలో సంచలనం సృష్టించిన సినీ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కీలకమైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హత్యకు గురికావడానికి ముందు దాడి జరిగిన సమయంలో వాటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోను చూస్తే సినీ నటుడు దర్శన్, అతని అనుచరులు పార్క్ చేసిన లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టి అతడిని తీవ్రంగా కొట్టినట్లు అర్థమవుతోంది.
రేణుకాస్వామి ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. మరో ఫొటోలో రేణుకస్వామి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా, అతడి చేతిపై తీవ్రమైన కోత గాయం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో అతడి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడు. ఈ ఫొటోలను అధికారులు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. దర్శన్ అనుచరుల్లో ఒకడైన పవన్ సెల్‌ఫోన్ నుంచి ఈ చిత్రాలను పోలీసు దర్యాప్తు బృందం వెలికితీసినట్లు సమాచారం. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక షెడ్‌లో అతడిని ఉంచి దాడి చేస్తున్నప్పుడు నిందితుడు పవన్ ఈ ఫోటోలు తీసినట్లు సమాచారం.
ఆ తర్వాత దర్శన్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న క్లబ్‌కు వెళ్లి ఈ ఫొటోలను అతడికి చూపించినట్లు సమాచారం. ఆ ఫోటోలు చూశాక తన సన్నిహితురాలు పవిత్ర గౌడ ఇంటికి వెళ్లి ఆమెకు షెడ్ వద్దకు దర్శన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రేణుకా స్వామిపై చిత్రహింసలు కొనసాగినట్లు సమాచారం. ఈ ఫొటోలు తీసిన మర్నాడు రేణుకాస్వామి మృతదేహాన్ని సుమనహళి వద్ద వరదనీటి కాల్వ సమీపంలో గుర్తించారు. అతడికి కరెంట్ షాక్ ఇచ్చి, మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది.