Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్- 8 మంది మావోయిస్టులు హతం - CHHATTISGARH ENCOUNTER
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి
Published : Feb 1, 2025, 3:29 PM IST
|Updated : Feb 1, 2025, 3:54 PM IST
శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కోసం భద్రతా దళాలు, పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రోజునే గంగలూర్ అడవుల్లోకి ప్రవేశించింది. మావోయిస్టుల స్థావరాలను గుర్తించేందుకు దాదాపు ఒకరోజంతా అడవులను జల్లెడ పట్టింది. ఈక్రమంలోనే శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు, భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ప్రతి కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు.
స్పష్టమైన సమాచారంతోనే!
మావోయిస్టుల పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యకర్తలు గంగలూర్ అడవుల్లో ఉన్నట్లు పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. దాని ఆధారంగానే ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇందులో జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది, కోబ్రా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.
వరుస ఎన్‌కౌంటర్లు
- 2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 48 మంది మావోయిస్టులు చనిపోయారు.
- జనవరి 16న బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు.
- జనవరి 21న ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం(62) మృతి చెందాడు. ఆయనపై రూ.కోటి రివార్డుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24 మంది మరణించినట్లు విశ్వసనీయ సమాచారం.
- మావోయిస్టు చలపతి, ఆయన టీమ్ ఏరివేత కోసం దాదాపు వెయ్యి మంది జవాన్లు ఈ నెల 19న కూంబింగ్ ప్రారంభించారు. నాలుగు డ్రోన్లతో అడవుల్లోని మావోయిస్టుల కదలికలను నిశితంగా పరిశీలించారు. వాటి ఆధారంగానే అడవుల్లో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే మావోయిస్టులను ఏ ప్రాంతంలో చుట్టుముట్టాలనే స్కెచ్ గీశారు. ఈ ప్లాన్ విజయవంతమైంది.
- 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 219 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.