తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఖైదీలకు కులం ఆధారంగా పని కేటాయించొద్దు!'- జైళ్లలో వివక్షపై సుప్రీంకోర్టు సీరియస్ - SC on Jails Discrimination

SC on Jails Discrimination : జైళ్లలో ఖైదీలకు కులం ఆధారంగా పనులు కేటాయించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కులానికి చెందిన వ్య‌క్తుల‌నే స్వీప‌ర్లుగా ఎంపిక చేయ‌డం స‌రైన విష‌యం కాదని పేర్కొంది. అన్ని కులాలకు చెందిన ఖైదీలను మానవత్వంతో సమానంగా చూడాలని చెప్పింది.

SC on Jails Discrimination
SC on Jails Discrimination (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 12:24 PM IST

Updated : Oct 3, 2024, 12:45 PM IST

SC on Jails Discrimination: జైళ్లలో కులవివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సమానత్వ హక్కుకు వ్యతిరేకం
కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్ర వర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్‌ 15ను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అలాంటి పనులు విభజనకు దారి తీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్​కు చెందిన సుకన్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్​లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Last Updated : Oct 3, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details