SC Verdict On Child Pornography : చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టం, ఐటీ చట్టాల కింద చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం నేరమేనని తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, దాని న్యాయపరమైన పర్యవసానాలపై ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. పోర్నోగ్రఫీ పరిభాషను మార్చాలని కేంద్రానికి సూచించింది. చైల్డ్ పోర్మోగ్రఫీ అనే పదానికి బదులుగా "చైల్డ్ సెక్సువల్లీ అబ్యూసివ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ మెటీరియల్"తో సవరించాల్సిన అంశాన్ని పార్లమెంట్ పరిగణించాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
పిల్లల పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం, చూడడం నేరమే: సుప్రీం కోర్ట్ - SC Verdict On Child Pornography
SC Verdict On Child Pornography : పోక్సో చట్టం, ఐటీ చట్టాల ప్రకారం చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Published : Sep 23, 2024, 11:37 AM IST
|Updated : Sep 23, 2024, 12:36 PM IST
'హైకోర్టు తీర్పు దారుణం'
ఈ కేసులో మద్రాసు హైకోర్టు గతంలో ఓ వ్యక్తిపై నిలిపివేసిన క్రిమినల్ ప్రోసీడింగ్స్‌ను పునరుద్ధరించింది సుప్రీం కోర్టు. సెషన్స్ కోర్టు ఈ కేసు విచారణను కొత్తగా చేపడుతుందని చెప్పింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు చట్టాలకు విరుద్ధమని ఇద్దరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా చేసిన సమర్పణలను సుప్రీం పరిగణలోకి తీసుకుంది. కాగా, ఫరీదాబాద్‌లోని 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్', న్యూదిల్లీకి చెందిన 'బచ్‌పన్ బచావో ఆందోళన్' అనే స్వచ్ఛంద సంస్థ తరపున హెచ్ఎస్ ఫూల్కా హాజరయ్యారు. ఈ రెండు సంస్థలు బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. అంతకుముందు, ఈ కేసులో హైకోర్టు తీర్పు దారుణమైనదిగా పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం, ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అంగీకరించింది.
హైకోర్టు తీర్పు ఇదీ!
చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కాదని ఈ ఏడాది జనవరి 11న మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసి చూసిన 28 ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. పోర్నోగ్రఫీ చూస్తూ పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపిన మద్రాస్ హైకోర్టు, ఈ అంశంలో శిక్షలు విధించడం కంటే సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సూచించింది. నిందితుడు కేవలం మెటీరియల్‌ను(చైల్డ్ పోర్నోగ్రఫీ) డౌన్‌లోడ్ చేసి, గోప్యంగా చూశారని, అది ఇతరులకు ప్రసారం చేయడం లేదా తిరిగి ప్రచురించలేదని జస్టిస్ ఎన్ ఆనంద్ తీర్పు సమయంలో పేర్కొన్నారు. అతడు అశ్లీల ప్రయోజనాల కోసం చిల్డ్రెన్ను ఉపయోగించలేదు కాబట్టి, ఇది నిందితుడి మోరల్ డికేగా పరిగణించాలని చెప్పారు. దీనితో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.