SC SERIOUS ON GUJARAT High Court :1996 సెప్టెంబరులో గుజరాత్‌లో తండ్రీకొడుకులు ఒక వ్యక్తిని హత్య చేశారనే కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం భిన్నాభిప్రాయానికి అవకాశం ఉందనే కారణంతో ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తీర్పును అప్పీలు న్యాయస్థానం కొట్టివేయడాన్ని తప్పుపట్టింది. సహేతుక కారణం లేనిదే నేర విముక్త తీర్పును రద్దు చేయరాదని స్పష్టం చేసింది.
దిగువ కోర్టు వెలువరించిన తీర్పులో ఏమైనా లోపాలుంటే స్పష్టంగా నమోదు చేయాలని, నమోదిత సాక్ష్యాలు వాస్తవమో కావో మరోసారి పరిశీలించి నిర్ధరించుకోవాలని జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే నమోదిత సాక్ష్యాల ఆధారంగానే దిగువ కోర్టు తుది నిర్ణయానికి వచ్చిందా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుందని తీర్పు రాసిన జస్టిస్ అభయ్ ఓక్ వ్యాఖ్యానించారు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల్లో ఈ ప్రశ్నకు సమాధానం లేదనే విషయాన్ని ధర్మాసనం గుర్తించింది. అలాగే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను కూడా నిందితుడిపై అప్పీలు కోర్టు మోపడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.
ఇదీ కేసు
1996 సెప్టెంబరులో గుజరాత్‌లో తండ్రీకొడుకులు ఒక వ్యక్తిని హత్య చేశారని సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితులు నేరం చేశారని నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవంటూ 1997 జులైలో నిందితులను విడుదల చేయాలంటూ ట్రయల్ కోర్టు ఆదేశించింది. దీనిని హైకోర్టులో సవాల్ చేయగా నిందితుల విడుదలకు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును 2018లో రద్దు చేసింది. ఇక హైకోర్టు నిర్ణయంపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువడింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.