SC Judgement On Marriage Relationship :వైవాహిక బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో, స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. ఓ మహిళ తన భర్తపై నమోదు చేసిన వరకట్న వేధింపుల కేసును శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టివేస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలను చాలా సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు, బంధువులు సున్నితంగా పరిష్కరించకపోవడమే కాకుండా ఇంకా పెద్దది చేస్తుంటారని తెలిపింది.
బాధితులయ్యేది వారి పిల్లలే!
అంతేకాకుండా పోలీస్‌స్టేషన్లలో కేసులతో పరిస్థితి మరింతగా చేయిదాటి పోతోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వారి వైవాహిక బంధం మరమ్మతుకు వీల్లేనంతగా సమస్యల్లో చిక్కుకుంటోందని తెలిపింది. దంపతులు విడిపోవడం వల్ల మొదట బాధితులయ్యేది వారి సంతానమేనని గుర్తు చేసింది. అందువల్ల దాంపత్య సమస్యలతో వచ్చే కేసులను కోర్టులు యాంత్రికంగా విచారించి విడాకులు మంజూరు చేయడం తగదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రతికేసులోనూ వేధింపుల తీవ్రత, ఇరుపక్షాల శారీరక, మానసిక స్థితులను, వారి వ్యక్తిత్వాలను, సామాజిక స్థాయిని సునిశితంగా కోర్టులు గమనించాలని వెల్లడించింది. విడాకుల మంజూరుతో వారి బిడ్డలు ఎదుర్కోబోయే కష్టాల గురించి కూడా ఆలోచించాలని పేర్కొంది. భార్య ఫిర్యాదు చేయగానే గృహ హింస నేరం కింద భర్తపై యాంత్రికంగా కేసు నమోదు చేయడం తగదని చెప్పింది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే కీచులాటలన్నీ క్రూరత్వం కిందకు రావని వెల్లడించింది. భర్తపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. భార్య ఫిర్యాదులో చేసిన ఆరోపణలు సాదాసీదాగా ఉన్నాయని, భర్త క్రూరత్వ చర్యలకు ఆధారాలను కానీ, ఏ రోజు ఎలా వేధించాడనే దృష్టాంతాలు కానీ లేవని తెలిపింది. ఈ పరిస్థితుల్లో భర్తపై నమోదైన క్రిమినల్ కేసును అనుమతించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది.