తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారందరికీ వేర్వేరుగా టాయ్‌లెట్లు ఉండాల్సిందే!'- రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు - SUPREME COURT ORDER ON TOILETS

ఆడ, మగ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు విడివిడిగా టాయిలెట్​ సౌకర్యాలు- హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

Supreme Court Order On Toilets
Supreme Court Order On Toilets (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 6:49 AM IST

Supreme Court Order On Toilets :పబ్లిక్‌ టాయ్‌లెట్లను అందుబాటులో ఉంచడం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాల ముఖ్య విధి అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అవి అందరూ ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని బుధవారం సూచించింది. లేకుంటే అది సంక్షేమ రాజ్యమనిపించుకోదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఆడ, మగ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు వేర్వేరు టాయ్‌లెట్లు ఉండాలని పేర్కొంది. ప్రజారోగ్యం చాలా ముఖ్యమని, సరిపడా పబ్లిక్‌ టాయ్‌లెట్‌లను అందుబాటులో ఉంచడం వల్ల వ్యక్తిగత ఏకాంతాన్ని పరిరక్షించినట్లవుతుందని, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ముప్పును తగ్గిస్తుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

  • టాయ్‌లెట్లను స్పష్టంగా గుర్తించగలిగేలా, జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది ఉపయోగించుకోగలిగేలా ఉండాలి. దీనిపై హైకోర్టులు పర్యవేక్షణ చేపట్టాలి.
  • ఇందుకోసం ప్రతి హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రధాన న్యాయమూర్తి నామినేట్‌ చేసిన జడ్జీ దీనికి నేతృత్వం వహించాలి. సభ్యులుగా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజాపనులు, ఆర్థిక శాఖల కార్యదర్శులు, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఉండాలి. ఆరు వారాల్లోగా ఈ కమిటీ ఏర్పడాలి.
  • ఈ కమిటీలు సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. సంబంధిత కోర్టులను సరాసరిన నిత్యం ఎంతమంది సందర్శిస్తున్నారు? వంటి వివరాలను సేకరించాలి. అందరికీ సరిపడా వేర్వేరు టాయ్‌లెట్లను నిర్మించి, నిర్వహించాలి.

పేదలకు వెచ్చించాల్సిన డబ్బు సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణానికా?
దేశ ఖజానాలోని డబ్బును పేదల గృహ నిర్మాణానికీ, వారికి విద్యావైద్య సౌకర్యాలు కల్పించడానికి వెచ్చించాలా? లేక దేశమంతా సైకిల్‌ ట్రాక్‌లు నిర్మించడానికి ఖర్చుపెట్టాలా? అని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఒక పిటిషనర్‌ను ప్రశ్నించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో శీతాకాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, సైకిళ్లు నడపడానికి ప్రత్యేక ట్రాక్‌లు నిర్మిస్తే మోటారు వాహనాల కాలుష్యం కొంత తగ్గుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుప్రీం ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. అయితే పిటిషనర్‌ కోరినట్లు ట్రాక్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఉత్తర్వు జారీచేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details