Places Of Worship Act In SC :దేశ వ్యాప్తంగా పలుచోట్ల వివిధ ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని, అలాగే ఎలాంటి ఆదేశాలు జారీ చేయరాదని స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991కి సంబంధించి అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఆయనతోపాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్, శరద్‌పవార్, మనోజ్ కుమార్ ఝా తదితరులు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం ప్రతిస్పందన తర్వాత ఇతర పార్టీలు రీజాయిండర్ దాఖలు చేయటానికి మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాతే ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.