Sanjay Raut Defamation Case :శివసేన- యూబీటీ కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు పరువు నష్టం కేసులో 15 రోజుల జైలు శిక్ష పడింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జైలు శిక్ష విధిస్తూ ముంబయి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధరించింది. రూ.25 వేల జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తనను బలిపశువుగా మార్చారని ముంబయి కోర్టు తీర్పు తర్వాత సంజయ్ రౌత్ ఆరోపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి మోదక్ తినడానికి దేశ ప్రధానమంత్రి వెళ్తే, అవినీతిపై పోరాడే తనలాంటి వారికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తాను మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయని వ్యాఖ్యానించానని, అప్పుడు శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ విచారణకు డిమాండ్ చేశారని చెప్పారు.
అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో కొంత మేర చర్చ జరిగిందని సంజయ్ రౌత్ తెలిపారు. అవినీతి జరిగిందా లేదా అని అప్పుడు తాను ప్రశ్నించానని, అది పరువునష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మన దేశంలోని మొత్తం న్యాయ వ్యవస్థ ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభావితమవుతుందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. సెషన్స్ కోర్టులో ముంబయి న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేస్తానని వెల్లడించారు.