Delhi Rainfall :భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ జలమయమైంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ప్రస్తుతం చాలా మంది ఎంపీలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం దిల్లీకి వచ్చి ఉన్నారు. భారీ వర్షాల కారణంగా వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి.
అనావృష్టి టూ అతివృష్టి!
దిల్లీలో నెలకొన్న నీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ ఇటీవలి కాలం నిరాహార దీక్ష చేసిన ఆప్ పార్టీ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఇంటి చుట్టూ నీళ్లు చేరాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. వరద నీటికి వల్ల తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పాడైపోయాయని అందులో పేర్కొన్నారు.
'నేను నిద్ర లేచే సరికి గదులు అన్నీ నీటితో నిండిపోయాయి. కార్పెట్స్, ఫర్నిచర్ సహా నేల మీద ఉన్న సామాన్లు అన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడం వల్ల వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల కరెంట్ షాక్‌లను నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు' అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను పార్లమెంట్‌కు సమయానికి వచ్చానని ఆయన చెప్పారు.
ఎత్తుకొచ్చి కారులో కూర్చోపెట్టారు!
వర్షాల వల్ల దిల్లీలోని రోడ్లు, నివాసాల చుట్టూ నీరు నిలిచిపేయింది. దీని వల్ల సామాన్య ప్రజలకే కాదు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడం వల్ల సిబ్బంది ఆయనను ఎత్తుకొని వచ్చి కారులో కూర్చోపెట్టాల్సి వచ్చింది. అయితే పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా చేశారని యాదవ్ తెలిపారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, 2 రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని తెగ బాధపడ్డారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిపోయిందని వాపోయారు. నీటిని తోడేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కారణమదే!
దిల్లీలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుండడంపై, దిల్లీ కౌన్సిలర్, బీజేపీ నేత రవీందర్ సింగ్ నేగి తీవ్రమైన విమర్శలు చేశారు. 'భారీ వర్షాల వల్ల అన్ని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందు వాటిలో పేరుకుపోయిన చెత్తను తీయకపోవడమే, ఈ దారుణ పరిస్థితికి కారణం' అని ఆయన ఆరోపించారు.
దిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనపై విమర్శలు
దిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే ఆ టర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టతనిచ్చారు. దిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్-1ను 2009లో ప్రారంభించారని పేర్కొన్నారు. దీనిపై అప్పటి పౌర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఘాటుగా స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ, విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.