Saif Stabbing Case :బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గతవారం దాడికి పాల్పడిన బంగ్లాదేశీయుడికి ఫేషియల్ రికగ్నిషన్ చేయాల్సి ఉందని ముంబయిలోని మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి, అరెస్టయిన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అలియాస్ మహ్మద్ రొహిల్లా అమీన్ ఫకీర్ (30) ఒక్కరేనా, కాదా అనేది తేల్చడానికి ఫేషియల్ రికగ్నిషన్ చేస్తామన్నారు. షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను శుక్రవారం ముంబయిలోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.
ఈ కేసులో అరెస్టయిన వ్యక్తి (షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్) తండ్రి ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. "సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి నా కొడుకు కాదు. ఆ వ్యక్తి పోలికలతో ఉన్నాడనే నెపంతోనే నా కుమారుడిని అరెస్టు చేశారు" అని నిందితుడి తండ్రి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌కు ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరడం గమనార్హం.
పోలీసుల వాదన
"సైఫ్ నివాసంలోని పాదముద్రలు, నిందితుడి పాదముద్రలు ఒకేలా ఉన్నాయా, లేదా అనేది మేం నిర్ధరణ చేసుకోవాల్సి ఉంది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన సమయంలో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ ధరించిన షూ ఇంకా రికవర్ కాలేదు. సైఫ్‌పై దాడికి వినియోగించిన కత్తిలోని మిగతా భాగాన్ని రికవర్ చేయాల్సి ఉంది. నిందితుడు విచారణలో మాకు సహకరించడం లేదు" అని కోర్టుకు పోలీసులు వివరించారు. "నిందితుడి వద్ద బంగ్లాదేశీ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అయితే అతడు విజయ్ దాస్ పేరుతో భారత్‌లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేసుకున్నాడు. ఇందుకోసం షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌కు సహకరించిన వారిని గుర్తించాల్సి ఉంది" అని న్యాయస్థానానికి ముంబయి పోలీసులు తెలిపారు.