Robert Vadra Politics :కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాబర్ట్ వాద్రా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రమ్మని తనను చాలామంది కోరుతున్నారని తెలిపారు.
మొదటి అడుగు అమేఠీతోనే!
గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి తనపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని రాబర్ట్ వాద్రా అన్నారు. ఒకవేళ తాను పోటీలోకి అడుగుపెడితే అమేఠీని ఎంచుకుంటానని తెలిపారు రాబర్ట్ వాద్రా. రాజకీయాల్లో తన మొదటి అడుగు అమేఠీతోనే ఉండాలని చెప్పారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు.
రాబర్ట్ వాద్రానే!
అమేఠీ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం పాటు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. ఇప్పటికే అమేఠీలో స్మృతి ఇరానీ పోటీని బీజేపీ ఖరారు చేయగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అమేఠీలో పోలింగ్ ఐదో దశలో జరగనుంది. ఈసారి రాహుల్ అక్కడ పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడంతో రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
హస్తం పార్టీకి నో క్లారిటీ!
అటు ఇప్పటివరకు సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి రాబర్ట్ వాద్రా సతీమణి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ బరిలోకి దిగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైన కూడా హస్తం పార్టీ ఇంకా స్పష్టతనివ్వలేదు. త్వరలోనే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగిలిన 63 స్థానాల్లో ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ప్రాంతీయ పాార్టీలు పోటీ చేయనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అమేఠీ, రాయ్‌బరేలీ అభ్యర్థులకు సంబంధించి పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.